Friday, May 2, 2025

కేంద్రానికి ‘కులగణన’ సవాల్

- Advertisement -
- Advertisement -

కులాల గణన పేరు చెబితే భయపడే కమలనాథులు ఇప్పుడు అకస్మాత్తుగా కులగణన చేపట్టడానికి తలవంచడం విస్మయం కలిగిస్తోంది. జనాభాలో కులాలవారీ శాతాలు బయటపడితే అగ్రవర్ణాలకు దూరం కావలసి వస్తుందని బిజెపితటపటాయించేది. బిజెపి మొదటినుంచీ హిందుత్వ భావజాలంతో అగ్రవర్ణాలను అక్కున చేర్చుకుని వారి ఓటు బ్యాంకు కొల్లగొట్టి అధికార ప్రాపకం పొందేది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా గతంలో విపి సింగ్ ప్రభుత్వం ఒబిసిలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలో హింసాత్మక ఆందోళనలు చెలరేగడం మరచిపోలేని వాస్తవం. 2021 జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులాలవారీ లెక్కలు సేకరించడం సాధ్యంకాదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణనను కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించడం అనూహ్యమైన నిర్ణయం.

పహల్గాం ఉగ్రదాడిపైనే దేశమంతా ఆందోళన చెందుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏ కారణాలు ప్రభావితం చేశాయన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చింది కాదు. గత సెప్టెంబరులోనే కేంద్రం సంకేతాలిచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందునుంచే విపక్షాలు కులగణన తప్పనిసరి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణతోపాటు కులగణన అంశాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా ప్రచారం చేసింది. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో కొంత కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా ఆధిక్యతను సాధించకుండా చేయడంలో కాంగ్రెస్ ప్రచారం బాగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ ఆకాంక్షించినట్టు 400 లోక్‌సభ స్థానాలను కట్టబెడితే రిజర్వేషన్లను బిజెపి రద్దు చేస్తుందన్న కాంగ్రెస్ ప్రచారం కూడా బాగా పనిచేసింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అజెండాలో కులగణన అంశాన్ని రాహుల్ గాంధీ చేర్చారు.

ఆమేరకు ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి. ఈ అవకాశవాద రాజకీయ దృష్టితో రానున్న బీహార్, గుజరాత్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే విపక్షాల ప్రధాన డిమాండ్‌కు అవకాశం ఇవ్వకుండా ‘కులగణన’ ప్రధాన ప్రచార ఆయుధంగా ఉపయోగపడుతుందని కమలనాథుల ఎత్తుగడ. బిజెపి పాలకులు కులగణనను వ్యతిరేకిస్తున్న సమయంలోనే రూ. 500 కోట్ల ఖర్చుతో నితీశ్ కుమార్ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణన జరిపించి అధికారికంగా దాని ఫలితాలను ప్రకటించింది. దేశం మొత్తం మీద బీహార్ తీసుకున్న ఈ చొరవ దేశ రాజకీయాల్లో కొత్త మలుపుకి నాంది పలికిందని చెప్పవచ్చు. 13 కోట్ల మంది జనాభా కలిగిన బీహార్ రాష్ట్రంలో 63% మంది అత్యంత వెనుకబడిన కులాలు (ఇబిసి), ఒబిసి కేటగిరీల కింద ఉన్నారని తేలింది. ఈ డేటా విడుదలై రెండేళ్లు కావస్తున్నా నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏ విధంగా తన లక్షాల సాధనకు ఈ సర్వేను ఉపయోగించింది అన్నది ప్రశ్న.

ఇప్పుడు కులాల పరిమాణాలు హాట్ టాపిక్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరాగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కులగణన నిర్వహించింది. బిసిలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని పార్టీల తోడ్పాటుతో బిల్లును శాసనసభలో ఆమోదింప చేసింది. ఈ ఆమోదాన్ని కేంద్రానికి పంపి మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో పదేళ్ల క్రితం వందకోట్లకు పైగా ఖర్చుపెట్టి కులగణన నిర్వహించినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నారు. కర్ణాటకలో రెండు ప్రధాన కులాలైన వక్కలిగలు, లింగాయతులు తమ జనాభాను తక్కువ చేసి చూపించారని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు కులాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి ఎంఎల్‌ఎలు కూడా వీరంగం సృష్టిస్తున్నారు. కులాలవారీ జనాభా లెక్కలు బ్రిటిష్ వారి పాలనలోనే దేశంలో 1933 లో చివరిసారి జరిగింది. అప్పటి నుంచి ఆగిపోయిన ఈ ప్రక్రియను తిరిగి చేపట్టాలన్న డిమాండ్ చిరకాలంగా వెనుకబడిన తరగతులనుంచి వస్తోంది.

1933 నాటి కులాలవారీ సేకరణ ఆధారంగానే ఒబిసిలు దేశ జనాభాలో 36% మాత్రమే ఉంటారని ఒక వర్గం, 60 నుంచి 70 శాతం ఉంటారని మరో వర్గం వాదనలు లేవదీయడమే తప్ప కచ్చితమైన వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. భారత రాజకీయాల్లో కులం అన్నది గుండెకాయ వంటిది. జనాభా లెక్కలతోపాటు కులగణన నిర్వహిస్తే కులాలవారీ కచ్చితమైన సమాచారం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కుల పరిమాణం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, అక్షరాస్యత స్థాయిలు, వృత్తులు, ఉద్యోగ స్వభావాలు తదితర ఇలాంటి క్షేత్రస్థాయి వాస్తవాలన్నీ బయటపడతాయి. ఏదైనా కులం ఎలాంటి వసతులు కానీ, ప్రభుత్వ సాయం కానీ అందకుండా బాగా వెనుకబడినా లేదా ఎవరైతే సమాజం విచక్షణకు గురయ్యారో, వారు ఎలా బతుకుతున్నారో ఈ వాస్తవాలన్నీ బయటపడతాయి.దీన్ని బట్టి ప్రభుత్వాలు తమ పాలన విధానాలను మెరుగుపర్చుకోడానికి ఆస్కారం కలుగుతుంది. కులాల సంఖ్య తేలితే ఎక్కువ కోటాలు డిమాండ్ చేయడానికి ఆందోళనలు రేగుతాయన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కేంద్రం ఇప్పుడు చేపట్టాలనుకుంటున్న కులగణన శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉంటేనే సత్ఫలితాలు చేకూరుతాయి. అయితే కేంద్రం ఎప్పుడు ఈ కులగణన చేపడుతుందో తెలియడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News