Tuesday, September 23, 2025

సింగరేణి కార్మికులు 34 శాతం బోనస్

- Advertisement -
- Advertisement -

ఒక్కొక్క పర్మినెంట్ కార్మికుడికి రూ. 1,95,610
ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి రూ.5,500/
మొత్తం 71 వేలమంది కార్మికులకు ప్రయోజనం
కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణి అభివృద్ధి 
తగ్గిన జిఎస్‌టితో తెలంగాణకు రూ.7వేల కోట్ల నష్టం
ఈ నష్టాన్ని కేంద్రమే భరించాలి
జిఎస్‌టి సంస్కరణలపై కేంద్రం.. ఏకాపక్ష నిర్ణయం తీసుకొని
రాష్ట్రాలపై భారం మోపడం సరికాదు:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాము తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం 71 వేల మంది సింగరేణి కార్మికులకు మేలు జరుగుతుందని సిఎం రేవంత్ తెలిపారు. 41 వేల పర్మినెంట్ ఉద్యోగులకు రూ.1,95,610లు, 30 వేల కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500ల వాటా అందుతుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఇప్పటికే దసరా అడ్వాన్స్‌గా రూ.25 వేలు ఇచ్చామని సిఎం రేవంత్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో సిఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు. సింగరేణి 2024,-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కార్మికులకు ప్రభుత్వం వాటా ప్రకటించింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని, రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను తమ పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని అందుకే సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6,394 కోట్లు అని, అందులో రూ.4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని సిఎం రేవంత్ చెప్పారు. రూ. 2,360 కోట్లు నికర లాభాలు వచ్చాయని అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించినట్లు సిఎం రేవంత్ తెలిపారు. గతేడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,000ల బోనస్ ఇచ్చామని ఈసారి రూ. 5,500లు అందిస్తునా ్నమని సిఎం పేర్కొన్నారు. సింగరేణికి విద్యుత్ సంస్థలు, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బకాయి ఉందన్నారు. ఇది క్లిష్టమైన సమస్య అని, ఆదాయం పెరగకుండా, ధరలు పెంచకుండా ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు.

సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సింగరేణి 2 బ్లాక్‌లు కోల్పోయిందని, 2 కోల్ బ్లాక్‌లు ప్రైవేటు వ్యక్తులు దక్కించుకున్నారని సిఎం రేవంత్ చెప్పారు. కోల్ బ్లాక్‌లను తిరిగి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని సిఎం అన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్‌లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో కార్మికులకు అండగా ఉంటామని సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తామని వెల్లడించారు.

కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలి
కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని, రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్ని కేంద్రం పూడ్చాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ప్రకారం రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, ఇప్పుడు ఈ నిర్ణయంతో నష్టం జరుగుతోందని సిఎం అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి ఏర్పడే నష్టంపై నివేదిక కూడా ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జీఎస్టీ చట్టం తెచ్చిన సమయంలో 14 శాతం ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వయబులిటీ గ్యాప్ ఫండ్ ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే విజిఎఫ్‌ను అమలు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, అంతే తప్ప తాము ఈ నిర్ణయాలు తీసుకుంటాం, మీ చావు మీరు చావండి అని మోడీ అనుకుంటే అది మంచిది కాదని సిఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. రాష్ట్రానికి వస్తున్న నష్టంపై డిప్యూటీ సిఎం లేఖ రాస్తారని దానిని కిషన్ రెడ్డి కేంద్రం వద్దకు తీసుకువెళ్లి నష్టాన్ని భర్తీ చేయించాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎంపిలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, సింగరేణి సిఎండి బలరాం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిన ఆ బొగ్గు బ్లాకులను తిరిగి తెచ్చుకుంటాం: డిప్యూటీ సిఎం
71 వేల మంది సింగరేణి కార్మికులకు దసరా పండుగ బోనస్‌ను అందిస్తున్నామని అందులో భాగంగా 41 వేల పర్మినెంట్ ఉద్యోగులకు రూ.1,95,610లు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500లను అందిస్తున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బొగ్గుతోపాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లోకి సింగరేణి ప్రవేశిస్తుందని ఆయన అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లను దసరా బోనస్ గా ప్రకటిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లించిన చరిత్ర లేదన్నారు. సింగరేణి తెలంగాణకు ఆత్మ వంటిదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పెడితే గత ప్రభుత్వం పాల్గొనలేదన్నారు. ఫలితంగా సింగరేణి ప్రాంతంలో రెండు బొగ్గు గనులు ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు వెళ్లాయన్నారు. ఆ రెండు బొగ్గు బ్లాక్లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడంతో సింగరేణికి నష్టం చేకూరిందన్నారు. ఆ రోడ్డు గనుల్లో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయని, ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిన ఆ బొగ్గు బ్లాకులను తిరిగి తెచ్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని డిప్యూటీ సిఎం తెలిపారు.

Also Read: విచారణలో తెలియదు…గుర్తులేదు…అని చెబుతున్నారు.. ఆయన బెయిల్ రద్దు చేయండి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News