Tuesday, August 5, 2025

సిరాజ్ సూపర్ బౌలింగ్

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హైదరాబాదీ స్టయిలీష్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. సిరీస్‌లో సిరాజ్ అంచనాలకు మించి రాణించాడు. చివరి టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శనతో ఏకంగా 9 వికెట్లను పడగొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. సిరీస్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి వికెట్‌ను పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ ఏకంగా 23 వికెట్లను పగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రెండు సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను తీశాడు.

ఓసారి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కొంత కాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సిరాజ్‌కు ఇంగ్లండ్ సిరీస్ కొత్త ఊపు ఇచ్చిందని చెప్పాలి. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా అన్ని మ్యాచ్‌లను అందుబాటులో లేకున్నా సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ఆ లోటు జట్టుపై కనబడకుండా చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ సిరాజ్ అత్యంత నిలకడైన బౌలింగ్‌ను కనబరిచాడు. భారత్ సిరీస్‌ను సమంగా ముగించిందంటే దానికి సిరాజ్ అసాధారణ బౌలింగ్ కూడా ప్రధాన కారణమని చెప్పాలి. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్‌లతో పోటీ పడి సిరాజ్ వికెట్ల పంట పండించాడు. ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు. ఈ ప్రదర్శన సిరాజ్ కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సిరాజ్‌కు సిఎం అభినందనలు

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సిరాజ్ అసాధారణ ప్రతిభతో దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేశాడని కొనియాడారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా సిరాజ్‌ను అభినందించారు. సిరాజ్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News