Thursday, May 2, 2024

మోడీ ప్రకటనలన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలే : సీతారాం ఏచూరి ధ్వజం

- Advertisement -
- Advertisement -

కోజికోడ్ ( కేరళ ) : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రకటనలన్నీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు తాను ఫిర్యాదు చేశానని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. గురువారం ఉత్తర కేరళ జిల్లాలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మోడీని, బీజేపీని వామపక్షం వ్యతిరేకించడం లేదని , మౌనంగా ఉంటోందని కాంగ్రెస్, యుడిఎఫ్ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. ఆ ఆరోపణలు సరికావన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అరెస్టయిన రాజకీయనేతల్లో మొదటి నేతను తానేనని గుర్తు చేశారు.

అలాగే 370 ఆర్టికల్ రద్దు తరువాత కశ్మీర్‌లో రాజకీయ నాయకులను నిర్బంధించారని, దానిపై సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది వామపక్ష పార్టీయేనని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్లను వ్యతిరేకించింది కూడా సీపీఎంయేనని పేర్కొన్నారు. ఈ విషయాల్లోనే కాకుండా మిగతా సమస్యలపై కూడా కాషాయ పార్టీని వ్యతిరేకించడం లోనూ, నిలదీయడం లోనే సిపిఎం ముందున్నట్టు చెప్పారు. బీజేపీని వ్యతిరేకించడం లేదని సీపీఎంపై ఆరోపణలు చేసే వారు ఇవన్నీ తెలుసుకోవాలని సూచించారు. సిపిఎం వటకర అభ్యర్థి కేకే శైలజపై సోషల్ మీడియాలో తీవ్రమైన, అసభ్యకరమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏచూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఔచిత్యాన్ని పాటించాలని హితవు పలికారు. నేతలు ఎవరైనా ఎదుటివారిని విమర్శించ వచ్చు.

అవి పార్టీ పరంగా, విధానాలు పరంగా ఉండాలే తప్ప అసత్యాలు ప్రకటిస్తూ, వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడకూడదన్నారు. ఇదిలా ఉండగా సిపిఎం వటకర అభ్యర్థి కేకే శైలజపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కార్యకర్తపై పోలీస్‌లు కేసు నమోదు చేశారు. శైలజపై కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ ప్రోత్సాహంతో సైబర్ దాడి జరుగుతోందని ఆరోపిస్తూ సిపిఎం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అధికార పార్టీ కథలు చెబుతోందని విమర్శించింది. కేరళలో ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News