నేటి నుంచి సూపర్-4 సమరం
రాత్రి 8 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగే తొలి సూపర్4 పోరులో బంగ్లాదేశ్ టీమ్‌తో శ్రీలంక తలపడనుంది. లీగ్ దశలో లంక ఆడిన మూడు మ్యా చుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్4లోనూ సత్తా చాటేందుకు లంక సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే ఆటగాళ్లు రెండు జట్లలోనూ ఉన్నారు. నిసాంకా, కుశాల్ మెండిస్, కెప్టెన్ అసలంక, కమిల్ మిశ్రా, కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, హసరంగ తదితరులతో లంక బ్యాటింగ్ బలంగా ఉంది.
Also Read: 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!
అఫ్గాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కుశాల్ పెరీరా, అసలంక, మెండిస్ తదితరులతో లంక బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక తుషారా, చమీరా, శనకా, హసరంగలతో బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న లంక ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ జట్టులోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ లిటన్ దాస్, ఓపెనర్లు సైఫ్ హసన్, తంజీద్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్, జాకేర్ అలీ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. నాసుమ్ అహ్మద్, తస్కిన్, ముస్తఫిజుర్, రిశాద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో బంగ్లా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.