Tuesday, August 5, 2025

చిన్నారులకూ స్మార్ట్ కాటు

- Advertisement -
- Advertisement -

స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కే కొద్దీ వాటిని వాడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క 2025 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 730 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నట్లు ఓ అంచనా. అందులో 69 కోట్ల మంది మన భారతదేశంలో ఉన్నారు. అంటే దేశ జనాభాలో దాదాపు సగం మంది స్మార్ట్‌ఫోన్లుఉపయోగిస్తున్నారన్న మాట. అయితే వీరిలో చెప్పుకోదగ్గ శాతం మంది టీనేజర్లు, చిన్నపిల్లలు ఉండడం గమనార్హం. రాంచీ ఎయిమ్స్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం అయిదేళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఇప్పుడు సగటున ప్రతిరోజూ 2 గంటల పాటు మొబైల్ ఫోన్లలో మునిగి తేలుతున్నారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనలో పడవేస్తోంది. చిన్నపిల్లలు రోజంతా నిత్యం మొబైల్ స్క్రీన్లు చూస్తూ గడిపేయడాన్ని అనుమతించడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని చిన్న పిల్లల వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, అన్నిటికీ మించి మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతాయని (There bad consequences) వారు హెచ్చరిస్తున్నారు. 21వ శతాబ్దంలో స్మార్ట్‌ఫోన్లు చిన్నపిల్లల జీవితాల్లో తప్పనిసరి భాగమయ్యాయని కొంతమంది వాదించవచ్చు. తల్లిదండ్రులు బిజీ లైఫ్‌ల కారణంగా చిన్నపిల్లలు తమను చికాకు పెట్టకుండా ఉండేందుకు వారికి స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి ఒక విధంగా వారిని వాటికి అడిక్ట్ అయేలా చేస్తున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి కరోనా మహమ్మారి సైతం చిన్నపిల్లలు స్మార్ట్‌ఫోన్లలో మునిగి తేలేలా చేసిందని చెప్పవచ్చు. అప్పట్లో స్కూళ్లు మూతపడ్డం, ఆన్‌లైన్ తరగతులు జరుగుతూ ఉండడంతో పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు తప్పనిసరిగా మారాయి. అయితే అప్పుడు మొదలైన ఈ అలవాటు ఇప్పుడు వారిపట్ల శాపంగా మారుతోంది.

కరోనా ముప్పు తొలగిపోయినప్పటికీ అప్పుడు మొదలైన స్మార్ట్‌ఫోన్ వాడకం అనే జబ్బు ఇప్పుడు కూడా మరింత ప్రమాదకరంగా మారింది.ఓ విధంగా తల్లిదండ్రులు సైతం పిల్లలు తమ జోలికి రావడం లేదు కదా అని వారు ఫోన్లలో మునిగిపోతున్నా చూసీచూడనట్లు ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే దీనివల్ల ఎదురవుతున్న ముప్పును వారు గ్రహిస్తున్నారు.కానీ ఈ జాడ్యాన్ని ఎలా పోగొట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే వాస్తవానికి పిల్లలు స్మార్ట్‌ఫోన్లు చూడకుండానే పెరగగలరని చిన్నపిల్లల వైద్యనిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్లు రాకముందు వారు అలాగే పెరిగి పెద్దవాళ్లయ్యారు కదా అనేది వారి వాదన. అది నిజమే కదా! అప్పట్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, వారి చదువులపట్ల శ్రద్ధ చూపించే వారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఆ ఓపిక, ఆసక్తి లేదనే చెప్పాలి.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కనుమరుగయిపోయి, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం పెరిగిపోవడంతో పిల్లల ఆలనా, పాలన పట్ల వారు శ్రద్ధ చూపడం తగ్గిపోయిందనేది కాదనలేని వాస్తవం. మహా అయితే తమ పిల్లలను వేలు, లక్షల రూపాయలు పోసి పేరున్న కార్పొరేట్ స్కూళ్లకు పంపించి, హాస్టళ్లలో చేర్పించి తమ బాధ్యత తీరిపోయిందని అనుకొంటున్నారు.కానీ తల్లిదండ్రులకు సమానం ఎవరూ కాదు. అందుకే పిల్లలు ఇంటికి వచ్చాక స్మార్ట్‌ఫోన్ పట్టుకుని కూర్చోనివ్వకుండా స్కూల్లో హోంవర్క్ ఏం ఇచ్చారో గమనించి, అది పూర్తి చేసేలా ఓ గంటపాటు పిల్లలతో గడపడం చేస్తే ఆటోమేటిగ్గా స్మార్ట్‌ఫోన్ వ్యసనం దూరమవుతుందని నిపుణులు అంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులయితే మూడు నాలుగేళ్ల వయసు పిల్లలు సైతం ఏడవకుండా ఉండడానికి వాళ్ల చేతికి ఫోన్లు ఇచ్చి తమకు తెలియకుండానే వాటికి బానిసలుగా మారేలా చేస్తున్నారు.

అంతేకాదు పిల్లలు ఎప్పుడూ తమ అమ్మానాన్నను అనుకరించాలని చూస్తుంటారు. వాళ్లు స్మార్ట్‌ఫోన్‌లో మునిగి తేలుతుంటే పిల్లలు కూడా అలాగే చేస్తారని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోకుండా పిల్లలతో గడపడం వల్ల వారిలో ఈ వ్యసనాన్ని వీలయినంత మేరకు తగ్గించవచ్చని కూడా నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాదు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, సంతోషం, బాధ లాంటి భావోద్వేగాలు లేకుండాపోవడం లాంటి లక్షణాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఈ లక్షణాలనే వారి పరిభాషలో ‘బ్రెయిన్ రాట్’గా పిలుస్తారు. అంతేకాదు సెల్‌ఫోన్ల్ కనిపించే హింస, సెక్స్‌కు సంబంధించిన అంశాలను చూడడం వల్ల టీనేజర్లు హింసాప్రవృత్తికి అలవాటు పడడం, నేరాలు పెరిగిపోవడం జరుగుతోందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.

మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఒకవేళ పిల్లలు స్మార్ట్‌ఫోన్ కోసం మారాం చేస్తే తల్లిదండ్రులు వారిని చదువులవైపు మళ్లేలా చేయాలని, ఫోన్‌లో అందుకు సంబంధించిన అంశాలే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వారిని ఫోన్లలో ఇతర అంశాలు చూడకుండా చేయవచ్చని పిల్లల వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చివరగా ఫోన్ ఎప్పటికీ పేరెంట్ కాబోదని, ఒకవేళ అలా మారినా అది తీవ్ర పరిణామాలకే దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎక్కువగా సెల్‌ఫోన్ చూడడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో నేరాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణమని ప్రతి ఒక్కరూ అంటున్నా పట్టించుకోవడం లేదు. ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్న పెద్దల మాట గుర్తుంచుకుని మసలుకోవడం, కనీసం పిల్లల విషయంలోనైనా జాగ్రతపడడం ఎంతయినా అవసరమని వాళ్లు హెచ్చరిస్తున్నారు. లేదంటే పెను ప్రమాదం తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News