సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పూర్తయిన ప్రవేశాలు
పారదర్శకంగా 17 వేలకి పైగా సీట్లు భర్తీ
ఫౌండషనల్ సిఓఈలో 1,420 మంది విద్యార్థులకు అవకాశం
జులై 31న స్పాట్ అడ్మిషన్లకు ఏర్పాట్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ ఏడాది పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 17 వేలకుపైగా సీట్లు నింపడంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా, ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం గమనార్హం.
ఐఐటీ, నీట్ కోర్సులకు లక్ష్యంగా ఫౌండషనల్ సిఓఈలు : నీట్, ఐఐటి జేఈఈ, సిఎంఎ, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ అందించే 11 ఫౌండషనల్ ఈఎస్‌లో విద్యార్థులకు ఎంట్రన్స్ కోచింగ్‌ను అందిస్తున్నారు. ఈ ఏడాది వీటిలో 1,560 సీట్లు అందుబాటులో ఉండగా, 1,420 సీట్లు ఇప్పటికే నింపారు. ఇందులో ప్రవేశానికి ఎంపిక ప్రమాణాల ప్రకారం, సైన్స్ విభాగంలో 90 శాతం, ఆర్ట్ విభాగంలో 80 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విద్యార్థుల ఎంపిక జరిగింది. మిగిలిన ఖాళీలను స్పాట్ అడ్మిషన్ల ద్వారా జూలై 31న భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లా స్థాయి సిఓఈఎస్‌లలో : రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా నడుస్తున్న 26 సిఓఈలలో ప్రవేశాలు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడ సైన్స్ విద్యార్థులకు 70 శాతం, ఆర్ట్, వొకేషనల్ విద్యార్థులకు 60 శాతం అర్హతగా నిర్ణయించారు. ప్రత్యేకంగా రూపొందించిన అకడమిక్ క్యాలెండర్, మైక్రో లెవెల్ ప్లానింగ్, నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల శిక్షణను అందిస్తున్నారు.
విద్యార్థుల ఎంపిక – స్పష్టమైన ప్రక్రియ : ప్రవేశ ప్రక్రియను మే నెలలోనే పూర్తిచేయగా అనంతరం అభ్యర్థులు కోర్సులు మానేసిన లేదా హాజరుకాని కారణంగా ఏర్పడిన ఖాళీలను నాలుగు విడతలుగా నిర్వహించి, జూలై మూడవ వారంలో పూర్తిగా భర్తీ చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన పురోగతి సాధించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం చేపట్టిన పలు సంస్కరణలు వినూత్న మార్పులు, పారదర్శకత ఈ విజయానికి దోహద పడ్డాయి.
రుక్కాపూర్ సైనిక పాఠశాలలో- పూర్తయిన అడ్మిషన్లు : ప్రతి ఏడాది మాదిరిగానే రుక్మాపూర్ సైనిక పాఠశాలలో ఈ సంవత్సరం కూడా 100 శాతం అడ్మిషన్లు జరిగాయి. ప్రస్తుతం విద్యార్థులు కొన్ని కారణాలచేత జాయిన్ కానీ లేదా ఇతర పరిస్థితుల కారణంగా ఏవైనా ఖాళీలు ఉన్నా ఆ ఖాళీలను మెరిట్ ఆధారంగా అర్హులైనవారి చేత భర్తీ చేప్తున్నారు.
ఒకేషనల్ కోర్సుల- అవసరాన్ని బట్టి ప్రవేశాలు : వోకేషనల్ కోర్సులు పూర్తిగా నీడ్ బేసిస్ అవసరాన్ని బట్టి, ఆధారపడి ప్రవేశాలు పొందుతున్నారు. సీట్లు ఉన్నప్పటికీ, విద్యార్థుల ఆసక్తి ఈ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఉన్నాయా లేదా అని ప్రస్తుత మార్కెట్ ఆధారంగా అవసరాల ఆధారంగా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
నూతనంగా ప్రవేశ పెట్టిన వినూత్న కార్యక్రమాలు : ఈ ఏడాది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా స్థాయి సిఓఈఎస్‌లో మొదటి సంవత్సరంలో 95%కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఫౌండషనల్ సిఓఈఎస్ లో రెండో సంవత్సరంకు ప్రవేశం కల్పిస్తోంది. ఇది విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు ఇచ్చే, మంచి భవిష్యత్తుకు దారితీసే ఒక ముందడుగు అని చెప్పవచ్చు.
జూలై 31న స్పాట్ అడ్మిషన్లు : ఫౌండేషనల్, జిల్లా స్థాయి సిఈలో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 31న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. సంస్థ అధికారిక వెబ్ సైట్ [ tgswreis.telangana.gov.in](https://tgswreis.telangana.gov.in) లో ఇనిస్టిట్యూషన్ వారీగా ఖాళీల వివరాలు అందుబాటులో పొందుపరుస్తారు.