న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు సోనూ సూద్ బుధవారం దేశ రాజదానిలోని ఇడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఐఎక్స్‌బెట్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సమన్లతో ఆయన ఇడి ఎదుటకు రావల్సి వచ్చింది. సంబంధిత యాప్‌నకు సంబంధించే ఇప్పటికే మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, యువరాజ్‌సింగ్ , టిఎంసి ఎంపి, యాక్టర్ మిమి చక్రవర్తి, బెంగాల్ యాక్టర్ అంకుశ్ హజ్రాలపై గత వారం విచారణ జరిగింది. ఇప్పుడు సోనూ సూద్ వంతు వచ్చింది. పిఎంఎల్‌ఎ పరిధిలో ఆయనపై విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్లు వెల్లడైంది.
ఈ బెట్టింగ్ యాప్ దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. పలు కోణాలలో డబ్బుల అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలతో కొందరు మహిళా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్స్‌ను కూడా విచారించారు. 70 భాషలలో ఈ బెట్టింగ్ యాప్ నడుస్తోంది. ఈ యాప్ నిర్వాహకులు భారీ మొత్తంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఎగవేతలకు దిగుతున్నారని, ప్రజలను ఈ బెట్టింగ్ యాప్ కోట్లాది రూపాయల మేర మోసగిస్తోందని కేసు బుక్ అయింది. ఈ క్రమంలోనే పలువురు సినీ తారలు, క్రికెటర్లు, సామాజిక మాధ్యమాల వారు, ఇతర రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రమేయం, వారి ప్రచారంపై కూడా పెద్ద ఎత్తున నిగ్గు తేల్చేందుకు ఇడి సిద్ధం అయింది.