Saturday, August 9, 2025

ఆ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచాం: టిజిఎస్ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రేమ, అనురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి సండర్భంగా టిజిఎస్ ఆర్‌టిసి ప్రయాణీకుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ నెల 11 వరకు నడుపుతున్న ఈ స్పెషల్ బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచినట్లు సంస్థ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ జిఓ ప్రకారమే రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్లు వెల్లడించింది ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు వివరించింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. ఈ నెల 11వ తేదీ వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయని వివరించింది. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసింది. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్‌టిసి యాజమాన్యం నడుపుతోంది.

తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ, రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003 లో జిఓ నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని సంస్థ తెలిపింది. ఈ జిఓ ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్బంగా సవరించినట్లు తెలిపింది. రాఖీ పౌర్ణమికి ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు ఆర్‌టిసి యాజమాన్యం సూచించింది. ఆర్‌టిసి సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News