Sunday, April 28, 2024

బిజెపి ఆంతర్యం!

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ప్రభుత్వం తాను కోరుకొన్నదే చేస్తుంది గాని, దేశానికి అవసరమైన దానిని ఆచరించాలని కలలో కూడా సంకల్పించదు. తాను కోరిన దానినైనా నలుగురూ అనుసరించే పద్ధతిలో ఎంత మాత్రం జరిపించదు. పార్లమెంటు కొత్త భవనంలోకి ప్రవేశించిన సందర్భంగా ఎంపిల కిచ్చిన బహుమతుల్లో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రతిని కూడా చేర్చడం బాగుంది. కాని దాని ఉపక్రమణికలో వుండవలసిన సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు లేకపోడం ప్రతిపక్షాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మిగతా అన్ని సవరణలతో గల రాజ్యాంగాన్ని సభ్యులకు ఇస్తూ ఒక్క ఉపక్రమణికను మాత్రం ఈ రెండు పదాలు తొలగించి పంచడంలోని ఔచిత్యాన్ని కాంగ్రెస్, ఎన్‌సిపిలు ప్రశ్నించాయి. దానితో రాజ్యాం గం అవతరించినప్పటి అసలు ఉపక్రమణికను మాత్రమే తాము పంచిపెట్టామని బిజెపి సమాధానం చెప్పింది. సవరించిన ఉపక్రమణికకు బదులు అసలుదాన్నే అనుసరించాలని బిజెపి కోరుకొంటున్నపుడు అసలు ప్రజాస్వామ్య ఆలయమైన పార్లమెంటు పాత భవనాన్ని విడిచిపెట్టి కొత్త దానిలోకి ఎందుకు అడుగు పెట్టారని ఎన్‌సిపి ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.

బిజెపి నిజాయితీ లేనితనానికి ఈ ఉదంతం తాజా ఉదాహరణ. సోషలిజం, సెక్యులరిజం అంటే కమలనాథులకు బొత్తిగా గిట్టవనేది అందరికీ తెలిసిన సంగతే. చట్టం ముందు భారత పౌరులందరూ సర్వసమానులను చేస్తున్న, ప్రైవేటు కంటే ప్రజాయాజమాన్యానికి ప్రాధాన్యమిస్తున్న సోషలిస్టు తరహా పాలన వారికి సరిపడదు. పురుషుడి పైచేయిని, కులాల అంతరాలను కోరుకొనే ఆ పార్టీ రాజ్యాంగం హిందూత్వయేనన్నది వాస్తవం. అందుచేత మతావలంబన స్వేచ్ఛను పౌరులందరికీ ప్రసాదిస్తున్న సెక్యులరిజం అన్నా దానికి విషప్రాయమే. ఆ విషయాన్ని ఇప్పుడు రాజ్యాంగ ఉపక్రమణిక అసలు ప్రతిని పార్లమెంటు సభ్యులకు పంచడం ద్వారా బిజెపి పాలకులు మరోసారి చాటుకొన్నారు. పార్లమెంటులో తనకున్న విశేష బలంతో ఉపక్రమణికలోని ఈ రెండు పదాలను తగిన సవరణతో తొలగింప చేయడం దానికి సాధ్యమే. అలా చేయకుండా దొడ్డి దారిలో పాత ఉపక్రమణికను అందించడం ద్వారా తన కోరికను నెరవేర్చుకోడం కంటే కపటం ఇంకేముంటుంది? అసలు రాజ్యాంగ ఉపక్రమణికలో ఈ రెండు పదాలు లేని మాట వాస్తవం.

అయితే మన రాజ్యాంగం మౌలిక స్వరూపంలోనే సోషలిజం, సెక్యులరిజం ఆశయాలు ఇమిడి వున్నాయి. దానితో సంతృప్తి చెందని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆత్యయిక స్థితి కాలంలో 1976లో రాజ్యాంగం 42వ సవరణ ద్వారా ఉపక్రమణికను సవరించి అందులో ఈ రెండు పదాలను చేర్చింది. ఈ చర్యను బిజెపి వ్యతిరేకిస్తూ వచ్చింది. సెక్యులరిజం అనే పదాన్ని ప్రత్యేకించి చేర్చడం ద్వారా ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని, వాటికి సమాన దూరంలో వుంటుందని ఇందిరా గాంధీ ప్రభుత్వం చాటి చెప్పింది. హిందూ మెజారిటీ దేశంగా ఇండియాను మార్చదలచిన భారతీయ జనతా పార్టీకి ఇది మింగుడు పడని విషయమే. అయితే ఉపక్రమణికతో నిమిత్తం లేకుండా రాజ్యాంగంలోని 25, 26, 27 అధికరణలు మత సమానత్వాన్ని పెంపొందించడానికి ఉద్దేశిస్తున్నాయి. సెక్యులరిజం అనేది రాజ్యాంగం మౌలిక లక్షణమని 1994లో బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని వివిధ అధికరణలు, దాని ఉపక్రమణిక సోషలిస్టు, సెక్యులరిస్టు చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అందులో పేర్కొన్నది.

బిజెపి తదితర హిందూ మతతత్వ శక్తులు కోరుకొంటున్నట్టుగా సోషలిజం, సెక్యులరిజం పదాలను, వాటి మౌలిక స్వభావాన్ని రాజ్యాంగం నుంచి తొలగించినట్లయితే దేశంలోని అసంఖ్యాక పేదలకు రక్షణలు లేకుండా పోతాయి. సంక్షేమ చర్యలు వంటి వాటిని ప్రకటించనవసరం లేకుండా దేశ సంపదను సంపన్న, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి దారి ఏర్పడుతుంది. అలాగే సెక్యులర్ అనే పదాన్ని దాని లక్షణాన్ని రాజ్యాంగం నుంచి తొలగించినట్టయితే మైనారిటీలను కాల్చుకు తినడానికి అది దోహదపడుతుంది. దేశంలోని భిన్నవర్గాలు, మతాల ప్రజల మధ్య సామరస్యం నశించిపోయి బల ప్రయోగం ద్వారా ప్రజల నోళ్ళు మూసి పరిపాలించే విషాద స్థితి ఎల్లకాలం కొనసాగడానికి తలుపులు తెరుచుకొంటాయి. కనీస మానవత్వం కరవవుతుంది. కర్ర గల వాడిదే బర్రె అనే చందమవుతుంది. ప్రపంచ దేశాలు దాదాపు అన్నీ కోరుకొంటున్న ప్రజాస్వామ్య సమతా సమాజం నుంచి వెనక్కి మళ్ళే అవాంఛనీయ మలుపును భారత దేశం ఆవిష్కరించుకొనే దుస్థితి ఏర్పడుతుంది. సోషలిజం, సెక్యులరిజం పదాలు లేని ఉపక్రమణికను పార్లమెంటు సభ్యులకు పంచడం ద్వారా భారతీయ జనతా పార్టీ పాలకులు ఏమి ఆశిస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News