Thursday, May 2, 2024

ఢిల్లీలో కాసింత వాన.. జనాలకు కొండంత ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచుల, తీవ్రస్థాయి వాయుకాలుష్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీవాలాలకు కొంచెం వాన ఊరట కల్గింది. శుక్రవారం ఢిల్లీ, ఢిల్లీ పరిసరాలలో ఓ మోస్తరు వాన పడింది. దీనితో నగరంలో దిగజారుతున్న వాయు ప్రమాణాలకు కళ్లెం పడింది. గత పదిరోజులుగా తల్లడిల్లుతున్న తమకు ఈ వాన కొంచెం ఊపిరినిచ్చిందని జనం తెలిపారు. ఈ నెల 20 తరువాత నగరంలో వాయుకాలుష్యానికి విరుగుడుగా కృత్రిమ వర్షాలకు ఇటీవలే ఢిల్లీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఐఐటి కాన్పూర్ నిపుణుల బృందంతో దీని గురించి చర్చించింది. దట్టమైన మబ్బులు నెలకొని ఉంటే ఎప్పుడైనా మేఘమథనానికి వీలుంటుందని , వర్షాలు కురిపించవచ్చునని భావిస్తున్నారు. ఈ లోగానే గురువారం అర్థరాత్రి నుంచి స్వల్పస్థాయిలో వర్షాలు పడుతూ ఉండటంతో జనం కొంచెం రిలీఫ్ పొందారు. ఇప్పుడు కురిసిన వర్షంతో వాయు కాలుష్య తీవ్రత గణాంకాలు స్వల్ప స్థాయిలో తగ్గినట్లు పొల్యూషన్ బోర్డు తమ శాస్త్రీయ విశ్లేషణల గణాంకాలతో తెలిపింది.

ఢిల్లీ అంతటా కొద్దిపాటి వర్షాలు కురిసినట్లు వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి) తెలిపింది. కాగా పంజాబ్, హర్యానా, పశ్చిమ యుపి ఇతర ప్రాంతాలలో కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయని ఐఎండి సీనియర్ సైంటిస్టు కుల్దీప్ శ్రీవాస్తవా తెలిపారు. దీని వల్ల తేమశాతం పెరిగి, క్రమేపీ స్వల్పస్థాయిలో అయిన వాయుకాలుష్య తీవ్రతకు చెక్‌పడుతుందని వివరించారు. దివాలీకి ముందు వాతావరణంలో ఈ విధంగా సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. పశ్చిమ ఉపరితల పీడన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం దశలో త్వరలో గాలి వేగం గంటకు దాదాపు 15 కిలోమీటర్ల స్థాయికి చేరుకుంటుంది. దీని వల్ల గాలిలో కాలుష్య కణాలు కొంత మేరకు అయినా కొట్టుకుపోయ్యేందుకు వీలేర్పడుతుందని నిపుణులు తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల పంజాబ్, హర్యానా,

యుపి, పంటపొలాల్లో వ్యర్థాల దహనంతో వెలువడే కాలుష్యంతో ఢిల్లీలో బుధవారం వాయు కాలుష్యం 38 శాతానికి చేరింది, కాగా ఇది గురువారం 33 శాతంగా ఉంది. ఇప్పుడు శుక్రవారం ఇది 16 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వర్షాల వల్ల ఈ ఉపశమనం ఉందని గుర్తించారు. ఢిల్లీలో వాయు ప్రమాణాల పరిస్థితిని తెలిపే ఎక్యూఐ మధ్యాహ్నం 1 గంటలకు 314గా అత్యంత దయనీయ స్థితిని తెలిపింది. కాగా అంతకు ముందు సమయాలలో లెక్కించిన ఎక్యూలను విశ్లేషించుకుంటే పరిస్థితి మెరుగుపడిందని గణాంకాలతో వెల్లడించారు.

ఢిల్లీలో వాహన సరి బేసి స్కీం వాయిదా
ఇప్పుడు వాతావరణంలో కొంచెం మార్పు కనపడినందున ఈ నెల 13 20 వరకూ తలపెట్టిన సరి బేసి కార్ల రేషనింగ్ పద్థతికి బ్రేక్ వేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాలుష్య పరిస్థితిని విశ్లేషించుకుంటుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకించి ఈ సరి బేసి విధానానికి తెరతీస్తుంది. ఇది మంచి విధానం అయినందున దీనిని నిలిపివేసేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సరి బేసి విధానాన్ని దీపావళి తరువాతి పరిస్థితిని బట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఢిల్లీ , ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అలర్ట్
వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు వెలువరించింది. ఢిల్లీ, నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. ప్రజలకు వాయు కాలుష్య ప్రభావంతో తలెత్తే ఊపరితిత్తుల దుష్ఫ్రభావాలను ఆసుపత్రులకు పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని సరైన విధంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News