Friday, May 3, 2024

సన్‌రైజర్స్‌ను వెంటాడుతున్న ఓటములు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఐదింటిలో ఓటమి పాలైంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ ఆ తర్వాత రెండింటిలో గెలిచి గాడిలో పడినట్టు కనిపించింది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ మళ్లీ పరాజయాల బాట పట్టింది. చివరగా ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. వరుస ఓటములతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. సోమవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పోయింది. బౌలర్లు అసాధారణ ప్రతిభతో ఢిల్లీని 144 పరుగులకే పరిమితం చేశారు.

అయితే బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్ చిన్న లక్ష్యాన్ని సయితం అందుకోలేక పోయింది. కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న హారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, క్లాసెన్, కెప్టెన్ మార్‌క్రమ్ తదితరులు చెత్త ఆటతో నిరాశ పరుస్తున్నారు. ఐపిఎల్ మినీ వేలం పాటలో జాక్‌పాట్ కొట్టేసిన బ్రూక్ ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్‌లో రాణించాడు. కోల్‌కతాతో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ అజేయ శతకం సాధించాడు. ఈ ఒక్క మ్యాచ్ తప్పితే మిగతా పోటీల్లో బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. అంతేగాక మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, సుందర్‌లు కూడా చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. బౌలర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నా బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఏడు మ్యాచుల్లో హైదరాబాద్ కేవలం రెండింటిలో మాత్రమే గెలుపు రుచి చూసింది. మిగతా ఐదింటిలో అవమానకర రీతిలో ఓటములను మూటగట్టుకుంది. ఓడిన ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. జట్టును ముందుండి నడిపించడంలో మార్‌క్రమ్ పూర్తిగా విఫలమయ్యాడు.

కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా మార్‌క్రమ్ పూర్తిగా తేలిపోయాడు. ఇతర జట్ల సారథులు తమ తమ జట్లను ముందుండి నడిపిస్తుండగా మార్‌క్రమ్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందాడనే చెప్పాలి. దీంతో పాటు ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించలేక పోతున్నారు. మయాంక్, అభిషేక్ శర్మ, బ్రూక్ తదితరులు ఓపెనర్లుగా విఫలమయ్యారు. ఇక మెరుగైన ఫలితాల కోసం ఓపెనర్లను తరచూ మారుస్తున్నా తగిన ఫలితం దక్కడం లేదు. ఐపిఎల్‌లో ఒకప్పుడూ పరుగుల వరద పారించిన మయాంక్, రాహుల్ త్రిపాఠిలు ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ ఆటగాళ్లు చెత్త బ్యాటింగ్‌తో జట్టుకు సమస్యగా తయారయ్యారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటర్లు పూర్తిగా తేలిపోవడంతో సునాయాస లక్ష్యాలను సయితం ఛేదించలేక సన్‌రైజర్స్ ఘోర పరాజయాలు చవిచూస్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచుల్లో ఓడడంతో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.

హైదరాబాద్‌లాగే ఆరంభంలో వరుస ఓటములు చవిచూసిన ముంబై ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి మళ్లీ గాడిలో పడింది. ఢిల్లీ కూడా చివరి రెండు మ్యాచుల్లో గెలిచి సత్తా చాటింది. హైదరాబాద్ మాత్రం పేలవమైన ఆటతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇతర జట్లతో పోల్చితే హైదరాబాద్‌లో విధ్వంసక బ్యాటర్లకు కొదవలేదు. మయాంక్, మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, సమద్, క్లాసెన్ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. అయితే వీరంతా ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నారు. దీంతో ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా మిగిలిన మ్యాచుల్లో బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయాలు దక్కుతాయి. లేకుంటే మరిన్ని పరాజయాలు ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News