Thursday, May 2, 2024

బిహార్ కులగణనపై స్టేకు సుప్రీం నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా నిరోధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్రప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులఆదారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్ల విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేను సమర్థిస్తూ గత ఆగస్టు 2న పాట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ , ‘ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్’ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌విఎన్ కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ బీహార్ ప్రభుత్వం ఇటీవల సర్వే వివరాలను వెల్లడించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది అపరాజితా సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని వాదించారు.

దీనిపై స్టే ఇవ్వాలని వాదించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ‘ రాష్ట్రప్రభుత్వం లేదా ఏదయినా ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేం. అది తప్పిదమే అవుతుంది. ఒక వేళ డేటాకు సంబంధించి ఏదయినా సమస్య ఉంటే దాన్ని పరిశీలనలోకి తీసుకుంటాం. ఇటువంటి సర్వే నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వానికున్న అధికారాలు, తదితర అంశాలను పరిశీలిస్తాం’ అని పేర్కొంది. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన తదుపరి డేటాను ప్రకటించకుండా యథాతథ స్థితిని విధించాలని పిటిషనర్ కోరినప్పటికీ ధర్మాసనం అందుకు నిరాకరించింది.ఈ క్రమంలో పిటిషనర్ సవాలుపై రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వం ఎందుకు డేటాను ప్రచురించిందన్న బెంచ్ ప్రశ్నకు రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ సమాధానమిస్తూ, డేటా ప్రకటించడంపై ఎలాంటి స్టే లేదని, రాష్ట్రప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఈ డేటా అవసరమని చెప్పారు. అంతేకాదు డేటా సేకరణను అనుమతిస్తూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News