Thursday, May 2, 2024

75సీట్లతో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నదానిపై వరుసగా సర్వేలు వెల్లడవుతున్నాయి. తాజాగా జనతా కా మూడ్ అనే సంస్థ తన సర్వే రిపోర్ట్‌ను బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. మొత్తం సీట్లలో 72 నుంచి 75 సీట్లతో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని తెలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 31 నుంచి 36 సీట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలవనుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20 వేల శాంపిల్స్, ప్రతి నియోజకవర్గంలో 1,100 శాంపిల్స్ సేకరించి,లోతైన విశ్లేషణ చేసామని సర్వే చేసినట్టు జనతా కా మూడ్ వ్యవస్థాపకులు భాస్కర్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రెండు నెలలపాటు సర్వే చేశామని స్పష్టం చేశారు. శాంపిల్స్ తీసుకోవడంతో పాటు లోతైన విశ్లేషణ చేసి తాము ఈ అంచనాకు వచ్చామని తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలో చేపట్టినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయిందని, తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చేమో అని ఓటర్లు సందేహిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందన్నారు. ముఖ్యంగా రైతులు ఉచిత కరెంట్‌పై అమలుపై కాంగ్రెస్ కంటే సిఎం కెసిఆర్‌పైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులపై స్పష్టత లేకపోవడం, కేడర్‌లో అయోమయం వంటి కారణాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు మళ్లలేదని చెప్పారు. సిఎం తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలలో కెసిఆర్‌కు సరితూగే నాయకుడు లేరని, ఆయన నాయకత్వాన్నే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని సర్వే తేలిందన్నారు. కర్ణాటకలో బిజెపి పార్టీ ఓటమి,పార్టీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య గ్రూప్ రాజకీయాలు తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి కారణమయ్యాయని చెప్పారు.

ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్ షేర్ రానుందని వెల్లడించారు. కాంగ్రెస్‌కు 34 శాతం, బిజెపికి 14 శాతం, ఎఐఎంఐఎం 3 శాతం, ఇతరులు 8 శాతం ఓట్ షేర్ తెచ్చుకుంటాయని సర్వేలో ఈ సర్వేలో తేలింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణలో కేవలం 4 నుంచి 6 సీట్లు గెలవనుందని సర్వే తెలిపింది. సర్వే వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్, బిజెపిల మధ్య అంత భారీగా కాకపోయినా ఓ మోస్తరుగా చీలుతోందని తెలుస్తోంది. దీని వల్లే బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి కావల్సిన సీట్లు రాబోతున్నాయని వెల్లడవుతోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు…?

బిఆర్‌ఎస్ : 72 నుంచి 75 వరకు
కాంగ్రెస్ : 31 నుంచి 36 వరకు
బిజెపి : 04 నుంచి 06 స్థానాల వరకు
ఎంఐఎం : 06 నుంచి 07 స్థానాల వరకు
ఇతరులు : 00 స్థానాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News