Tuesday, April 23, 2024

పదితో కొట్టేశారు.. రూట్‌మార్చిన సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -
Cyber criminals
Cyber criminals

 

హైదరాబాద్ : సైబర్ నేరస్థులు కొత్త దారిలో వెళ్తున్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఫోన్ చేసి మినిమం ఫీజు పేరు చెప్పి వారి ఖాతాల్లోని మొత్తం డబ్బులు దోచుకుంటున్నారు. సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లికి చెందిన నందం విష్ణువర్ధన్ ఉద్యోగం కోసం వివిధ జాబ్ పోర్టళ్లలో తన రెస్యూమ్‌ను పెట్టాడు. ఈ నెల 7వ తేదీన సైబర్ నేరస్థుడు రోహన్ ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 చెల్లిస్తే జాబ్‌ను చూపిస్తామని చెప్పాడు. తాను ఒక లింక్‌ను పంపిస్తానని దానిపై క్లిక్ చేసి పంపాలని చెప్పాడు.

బాధితుడని మొబైల్ ఫోన్‌కు http://www.monsterjobs.co పంపించాడు. దానిలో లాగిన్ అయి నెట్‌బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించేందుకు యత్నించి ఓటిపిని ఎంటర్ చేయగా మొబైల్ ఫోన్‌కు ‘an error occurred, please try later’ అని వచ్చింది తర్వాత తన ఖాతా నుంచి రూ.94,572 విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిరుద్యోగులే లక్ష్యం…
నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరస్థులు కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వివిధ పోర్టళ్లలో పెడుతున్న రెజ్యూమ్‌లను చూసి వారికి ఫోన్ చేసి మోసం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు తక్కువగా ఉండడంతో నిరుద్యోగులు కూడా సులభంగా నమ్ముతున్నారు. సైబర్ దొంగలు పంపించిన లింక్‌ను ఓపెన్ చేయడంతో వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారి. రోజు రోజుకు సైబర్ నేరస్థులు కొత్తదారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

అపరిచితుల మాటలు నమ్మవద్దుః సైబర్ క్రైం ఎసిపి శ్రీనివాస్ కుమార్
ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని సైబరాబాద్ సైబర్ క్రైం ఎసిపి శ్రీనివాస్ కుమార్ కోరారు. సైబర్ నేరస్థులు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని తెలిపారు. మోసగాళ్లు పంపించిన ఎలాంటి లింక్‌లను ఓపెన్ చేయవద్దని కోరారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో డబ్బులు కట్టవద్దని, జాబ్ పోర్టల్ వారు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమని కోరరని తెలిపారు. జాబ్ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి యొక్క నిజాయితీని ఒకసారి పరిశీలించాలని అన్నారు. డబ్బులు పంపించే ముందు తల్లిదండ్రులు, స్నేహితులను అడిగి చెల్లించాలని తెలిపారు.

Target of Cyber criminals is Unemployed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News