Thursday, April 25, 2024

ప్రపంచకప్పే టీమిండియా లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌లో ట్రోఫీ సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతోందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈసారి భారత జట్టు కచ్చితంగా కప్పును సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో శాస్త్రి ఈ విషయం చెప్పాడు. ఇటీవల కాలంలో టీమిండియా వరుస విజయాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నాడు. సమష్టి పోరాటం వల్లే చారిత్రక విజయాలు సొంతమవుతున్నాయన్నాడు. కలిసి కట్టుగా పోరాడుతూ జట్టు వరుస విజయాలు సాధిస్తుందన్నాడు. టీమిండియాలో ప్రతి ఒక్కరూ జట్టు విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తారని, విజయోత్సవాల్లో కలిసి కట్టుగా పాలు పంచుకుంటారన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉందన్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకు లేనంత పటిష్టమైన రిజర్వ్‌బెంచ్ భారత్‌కు ఉందన్న విషయాన్ని రవి గుర్తు చేశాడు. ఏ ప్రదేశంలోనైనా విజయం సాధించే సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉందన్నాడు. ఒత్తిడిని సయితం తట్టుకుని విజయాలు సాధించడం టీమిండియా అలవాటుగా మార్చుకుందన్నాడు. దీనికి ఇటీవల జరిగిన పలు సిరీస్‌లలో జట్టు సాధించిన విజయాలే దీనికి నిదర్శనమన్నాడు. ఇక, న్యూజిలాండ్ సిరీస్ తమకు సవాల్ వంటిదేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే ఇందులో విజయం సాధించడం తమకు అసాధ్యమేమి కాదన్నాడు. కలిసికట్టుగా పోరాడితే సిరీస్ సొంతం చేసుకోవడం ఖాయమన్నాడు. తమ దృష్టంతా రానున్న టి20 ప్రపంచకప్‌పైనే నిలిచిందన్నాడు. ఇందులో ట్రోఫీని సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నాడు. దీని కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నామని రవి వివరించాడు.

Team India Goal winning T20 World Cup 2020: Ravi Shastri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News