మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా 2*2తో సమంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత జట్టు అంచనాలకు మించి రాణించింది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్, షమి తదితరులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. వీరు లేని లోటు జట్టుపై పెద్దగా కనిపించలేదు. శుభ్‌మన్ గిల్ తన తొలి సిరీస్‌లోనే కెప్టెన్‌గా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. చిరస్మరణీయ ప్రతిభతో జట్టును ముందుండి నడిపించాడు. బ్యాట్‌తోనే కాకుండా సారథిగా కూడా జట్టుపై బాగానే ప్రభావం చూపాడు.
తొలి మ్యాచ్ నుంచే గిల్ అద్భుతంగా రాణించాడు. గిల్ దూకుడుగా ఆడుతూ సీనియర్లు విరాట్, రోహిత్‌లు లేని లోటు జట్టుపై పడకుండా చేయడంలో సఫలమయ్యాడు. గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్‌లు కూడా కూడా బాగానే ఆడారు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. చిరస్మరణీయ బ్యాటింగ్‌తో పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో జడేజా ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. వాషింగ్టన్ సుందర్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పలు మ్యాచుల్లో బంతితో, బ్యాట్‌తో జట్టుకు అండగా నిలిచాడు. సిరాజ్, బుమ్రా, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులు బంతితో ఆకట్టుకున్నారు. ఇలా జట్టు విజయంలో పత్రి ఒక్కరు తమవంతు పాత్రను సమర్థంగా పోషించారు.
తీరు మారాల్సిందే..
సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చే సినా కొన్ని విషయాల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్‌లు వ్యక్తిగతంగా బాగానే ఆడారు. అయితే కలిసి కట్టుగా సా గడంలో విఫలమయ్యారు. ఇద్దరు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. దాదాపు ఆరు ఇన్నింగ్స్‌లలో వీరు 20 కంటే ఎక్కువ పరుగులను జోడించలేక పోయారు. రాహుల్ రాణిస్తే యశస్వి, జైస్వాల్ సత్తా చాటితే కెఎల్ విఫలం కావడం పరిపాటిగా తయారైంది. దీని ప్రభావం జట్టుపై బాగానే కనిపించింది. రానున్న సిరీస్‌లలో ఓపెనర్లు తమ ఆటను మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు సాధ్యమైనంత ఎక్కువగా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ప్రయత్నించాలి. వీరితో పోల్చితే ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలు చాలా మెరుగైన ప్రదర్శనను చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నిలకడ లోపించింది..
మరోవైపు టీమిండియా బ్యాటర్లలో నిలకడ కనిపించలేదు. ఒక ఇన్నింగ్స్‌లో రాణిస్తే మరో దాంట్లో విఫలం కావడం అలవాటు గా తయారైంది. యశస్వి, రాహుల్‌ల విషయంలో ఇదే జరిగింది. ఇక యువ ఆటగాడు సాయి సుదర్శన్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. సాయి ఒక ఇన్నింగ్స్‌లో రాణించి రెండో దాంట్లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇక సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. పలు మ్యాచుల్లో ఆడే అవకాశం లభించినా ఫలితం లేకుం డా పోయింది.
చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే నాయర్ అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా మ్యాచుల్లో పూర్తిగా నిరాశ పరిచాడు. కోహ్లి, రోహిత్‌లు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో నాయర్ జట్టుకు చాలా కీలకంగా మారాడు. అయితే అతను మాత్రం అంచనాలకు తగినట్టు రాణించలేక పోయాడు. నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్‌లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. ఆల్‌రౌండర్లుగా వీరు జట్టుకు అండగా నిలివడంలో విఫలమయ్యారు. రానున్న సిరీస్‌లలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి చూడాలి. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ నాటికి టీమిండియా ఈ లోపాలను సరిదిద్దు కుంటే జట్టుకు ప్రయోజనంగా ఉంటుంది. కెప్టెన్ గిల్‌తో పాటు ప్రధాన కోచ్ గంభీర్ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.