Thursday, May 2, 2024

అశ్విన్ మాయాజాలం

- Advertisement -
- Advertisement -

ధర్మశాలలోనూ ఇంగ్లండ్ చిత్తు
టీమిండియా ఇన్నింగ్స్ విజయం
4-1 తేడాతో సిరీస్ సొంతం

ధర్మశాల: ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగిన ఐదో, చివరి టెస్టులో ఆతిథ్య భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్ ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకుంది. ధర్మశాల టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇంగ్లండ్ ఏ దశలోనూ భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేక పోయింది. ఇక రోహిత్ సేన ఈ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే సొంతం చేసుకోవడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది. కుల్దీప్‌యాదవ్ (30), బుమ్రా (20) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో షోయబ్ బషీర్ ఐదు, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ రెండేసి వికెట్లను పడగొట్టారు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

అశ్విన్ మ్యాజిక్..

ఆ తర్వాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జాక్ క్రాలీ (0), బెన్ డకెట్ (2)లను అశ్విన్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే ఓలి పోప్ (19)ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జో రూట్, జానీ బెయిర్‌స్టో కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడిన బెయిర్‌స్టో కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. ధాటిగా ఆడిన బెయిర్‌స్టో 31 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 39 పరుగులు చేశాడు. అయితే జోరుమీదున్న అతన్ని కుల్దీప్ యాదవ్ ఎల్బీగా ఔట్ చేశాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. భారత బౌలర్లు వరుసగా వికెట్లను తీస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లకు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (2), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (8)లను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. టామ్ హార్ట్‌లీ (20), మార్క్‌వుడ్ (0)లను బుమ్రా వెనక్కి పంపాడు. షోయబ్ బషీర్ (13)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన జో రూట్‌ను కుల్దీప్ పెవిలియన్ బాట పట్టించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రూట్ 128 బంతుల్లో 12 ఫోర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 195 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు, బుమ్రా, కుల్దీప్ రెండేసి వికెట్లను పడగొట్టారు. కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌కు ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.

స్పిన్నర్లదే హవా..

ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ల హవా నడిపించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ ఐదు, అశ్విన్ నాలుగు, జడేజా ఒక వికెట్‌ను తీశారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు 8 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అశ్విన్ ఐదు, కుల్దీప్ రెండు, జడేజా ఒక వికెట్‌ను పడగొట్టాడు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు 7 వికెట్లను తీశారు. బషీర్ ఐదు, టామ్ హార్ట్‌లీ రెండు వికెట్లను తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో పడిన 30 వికెట్లలో స్పిన్నర్లే ఏకంగా 26 వికెట్లను తీయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News