Friday, September 19, 2025

బిసిలను మోసం చేసిన కాంగ్రెస్: తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బిసిలను మోసం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న విమర్శించారు. హన్మకొండలోని హరిత కాకతీయలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులో పక్కా మోసం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రతియేటా రూ.20 వేల కోట్ల పేరు చెప్పి తొలి బడ్జెట్‌లో రూ.9,200 కోట్లు పెట్ట్టి రూ.2,100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పది అంశాలతో డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ను జాతిపిత చేయాలని, కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసిలకు ప్రతియేటా లక్ష కోట్ల బడ్జెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూమిలేని 18 లక్షల బిసి కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. సచార్ నివేదిక ఆధారంగా మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందిస్తామని అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు. స్థానికత గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందించడం తమ విధానమని పేర్కొన్నారు. దీనికోసం మేధావులు, నిపుణులతో కమిటీ వేసి చర్చిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ బిసిలకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదo రజనీ కుమార్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News