Friday, May 3, 2024

మధ్యవేలికి మించిన చిటికెనవేలు

- Advertisement -
- Advertisement -

అట్టాడ అప్పల్నాయుడు గారు చేయి తిరిగిన కథకుడు. విభిన్న వస్తువులతో కథా నిర్మా ణం చేపట్టగలిగే దిట్ట. ఇతని రాజకీయ అవగాహన అపారం. సామాజిక జీవన నేపథ్యం ఆద ర్శం. తన కథలలో, నవలలలో సామాజిక, రాజకీయ నేపథ్యాలు విపులంగా అద్దుతారు. తన ’బహుళ’ నవలలో వందేళ్ల ఉత్తరాంధ్ర ప్రజల జీవన చరిత్రను 467 పుటల కాన్వాస్ పై తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. ఈ నవలపై వచ్చిన సమీక్షలను, విశ్లేషణలను ’బహుళం’ గా వెలువరించారు. అదే వేదికపై 18 కథలను ’చిటికెనవేలు కథలు’ గా ఆవిష్కరించారు. తాను చూసిన వ్యక్తుల జీవితాలు ఈ కథలలో పాత్రలుగా అగుపిస్తాయి. వెనుకబడిన, అణగారిన వర్గాల మానసిక సంఘర్షణల లోని దైన్యతను ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేయించి చిత్రీకరించారు. ఈ కథలలో అబలుల, అభాగ్యుల పీడనలను, వేదనలను మానవీయ కోణంలో స్పృశిస్తూ కథాగమనం సాగించారు. ఈ సంపుటిలో పాలకుల అవినీతిని, అక్రమాలను బట్టబయలు చేస్తారు. చైతన్య పూరితమైన కథా వస్తు, శిల్పాలను అర్థవంతంగా నడిపిస్తారు. ఇవే నాయుడు గారి కథాకథన నిర్మాణ శైలికి గీటురాళ్ళు.

’భౌభౌభౌ’ అనే కథలో వీధి బేపులు రాయల్ లైఫ్ కుక్కలను, ఆ కుక్కల యజమానులను పరుగులు పెట్టించడంతో కథ ముగుస్తుంది. పేదల భూమిని కాజేయాలని, వారి జీవన మనుగడలపై దెబ్బకొట్టాలనే ఆధిపత్య వర్గాలకు చివరకు చెంపదెబ్బ తప్పదు. వారిని వెంటబెట్టి తరిమి తరిమి కొట్టాలనే తిరుగుబాటు నేపథ్యాన్ని కథలో రచయిత చూపిస్తాడు. వీధి కుక్కలను బేపులని, ధనవంతులు ఇళ్లల్లో సకల భోగాలు అనుభవించే సీమ కుక్కలను కుక్కలని కథకుడు సంబోధిస్తారు. కుక్క ఏదైనా కుక్కే, దాని వెనుకటి గుణం మానదని సాధారణీకరిస్తారు. పేదలు నిర్మించుకున్న పట్టణ శివారు ప్రాంతాలు నేడు నగరం మధ్యలోకి వచ్చేసరికి అవి అతి విలువైన ప్రాంతాలుగా మారాయి. వాటిపై కార్పొరేట్ల కన్నుపడడం మామూలే. ఆయా శక్తులకు వత్తాసు పలికే రాజకీయ నాయకుల, అధికారుల లాబీయింగ్ లు ఈ కథలో మెండుగా తారసపడతాయి. ఈ కథలో ఇద్దరు ఆడా-మగా వలస కూలీల మధ్య, వారి వద్ద ఉన్న కుక్క-బేపిల మధ్య చిగురించిన ప్రేమ, ఆకర్షణలను నడిపే తీరు సహజాతి సహజంగా ఉంటుంది. కథాగమనం ఆసక్తిగా, వ్యంగ్యంగా సాగుతుంది.

‘పాఠ్యాంశం’ కథలో రచయిత తిత్లీ తుఫాన్ వల్ల ఉద్దానం ప్రాంతం నాశనమవడాన్ని గుర్తు చేస్తాడు. కథ చదువుతున్నంత సేపూ ఆనాడు ప్రజలు పడిన అవస్థలు కళ్ళముందు మెదులుతాయి. సకల ప్రాణికోటి తమ మనుగడను కోల్పోయి నానా ఇబ్బందులు పడడాన్ని ప్రస్తావిస్తాడు. ప్రకృతి మాత భీభత్స దృశ్యాలను చూపి విలపిస్తాడు. అనేక తుఫానులు ధాటికి ఉత్తరాంధ్ర ధాటిగానే నిలబడినప్పటికీ, హుద్ హుద్ మరియు తిత్లి తుఫాను సృష్టించిన విలయతాండవం మరువలేనిది. తిత్లీ ఉద్దాన ప్రాంతాన్ని, హుద్ హుద్ విశాఖపట్నాన్ని సర్వ నాశనం చేశాయి. ఈ రెండూ ఉత్తరాంధ్ర చిత్రపటాన్ని మార్చి వేశాయి. ఇలాంటి సందర్భంలో పాలకుల పర్యటనలలో భాగంగా అధికారుల ఆపసోపాలు ఎలా ఉంటాయో! రచయిత చూపిస్తాడు. పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉద్దానం ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను, గతంలో వారు చేపట్టిన ఉద్యమాలను అవహేళన చేస్తూ ఓ పెద్ద అధికారి మాట్లాడుతాడిలా. ’కంపెనీల్ని అడ్డేయడం కాదు, తుఫాన్ని అడ్డారా? కంపెనీల కూడా అడ్డలేరు. మీరు దేన్నీ అడ్డలేరు. ముందు ముందున్నాయి ముసళ్ళ పండుగలు’ అంటూ ఆ అధికారి చిరాకు పడతాడు. అధికారుల వద్ద ఉన్న బంట్రోతుల పరిస్థితిని ఇలా అద్దం పడతాడు.

దున్నపోతా! అన్న అధికారిని ఉద్దేశించి, ’నేను దున్నపోతునయితే నువ్వు యముడివా’ అని మనసులో గొణుక్కోవడం తప్పితే, ఎదిరించలేని స్థితిని వ్యక్తీకరిస్తాడు. నేటి నాయకుల వైఖరులను ఇలా ఎండగడతాడు. ’ఊరంతా దీపాలారిపోయి సీకట్ల ఉంటే, నా ఇంట్ల దేదీప్యంగా దివ్వెలెలగాలి. ఊరంతా ఉసూరుమని యేడస్తంతే నువ్వు ఉయ్యాల మీద ఊగుతుండాల. ఊరంతా బిక్కుబిక్కుమని సూస్తంతే నువ్వు దిక్కు లాగా ఆళ కళ్ళకి అగుపడాలా’ లాంటి సంభాషణలతో నేటి నాయకుల వక్రదృష్టిని తూర్పారబడతాడు. తిత్లీ బీభత్స సమయంలో ప్రజలను ఆదుకున్నది బడి పిల్లలు మరియు బడి పూజారులే. వారంతా బాధితులకు తోడుగా నిలిచి భోజనం ఏర్పాట్లు చేశారు. మొక్కలు, చెట్లను పెంచే క్రమంలో పిల్లలు గొప్ప సేవల అందించారు. మురికిగా ఉన్న వారిని చూసిన పెద్ద అధికారి సంబంధిత ప్రధానోపాధ్యాయున్ని కసురుకుంటారు. అప్పుడు పిల్లలు చురకలంటిస్తూ ఆ అధికారికి దీటైన జవాబు చెప్పడం కొసమెరుపు.

‘పనిముట్లు’ అనే కథలో వేసవి సాయ్ంర తం ’అధిక మెజారిటీతో ఉన్న అధికార పార్టీలా పొద్దు ధాటిగానే ఉంది’ అనే వర్ణనతో ప్రారంభిస్తాడు. బస్సు ట్రాఫిక్ లో మెల్లగా కదులుతుండటాన్ని ’ప్రతిపక్ష పార్టీ ఊరేగింపులా’ ఉందంటాడు. రద్దీగా ఉన్న బస్సులో కండక్టర్ కదలడాన్ని ’మెలికల కంతల్లోంచి బయటకు వచ్చే పాములా’ అని పోలుస్తాడు. ఇంకా ’సంచలు జబ్బుపడ్డ పశివిలా బస్సేట్రా’ గజానికో అడుగేస్తుందంటాడు. ఈ వర్ణనలలో ఔచిత్యం ఉంది. బస్సు ప్రయాణాలు నరకంలా ఉంటాయి, కానీ అందులోని ప్రయాణీకుల వ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ఈ కథలో ప్రయాణీకుల మధ్య సంభాషణలు-సంవాదనలు, తగువులు-తంటాలు, వినోదాలు-ఎకసెక్కాలు ఎంతో సహజంగా చూపిస్తాడు.

బస్సు ఎక్కిన వలస కూలీల చేతిలో గునపం, పార మొదలైన పనిముట్లను చూసిన పోలీసులు ఏదో! టెర్రరిస్టుల దాడులు ఉన్నాయన్న సమాచారంతో వెపన్స్ అని అంటారు. ఏవి వెపన్సో? ఏవి పనిమిట్లో? తెలియని స్థితిలో పోలీసు ఉండటాన్ని రచయిత దునుమాడుతాడు. ఇలా అనుమానిస్తున్న పోలీసులకు ఇది అర్థమయ్యేదెలా! అని రచయిత బాధపడతాడు. చివరకు ఇలా తలపోస్తాడు. ’పనిముట్లతో వాళ్లు ఒక భవంతినో, ఒక కాలువనో, ఒక పంట భూమినో, ఒక పంటనో సృష్టిస్తున్నారు. వాళ్లు ఊరిలోనా అదే పని చేశారు. వలస వచ్చి యీ నగరంలోనూ అదే పని చేస్తున్నారు’ అంటూ కథను సత్యానికి చేరువగా ముగిస్తాడు.

‘నాయినోరే’ కథలో ధనవంతులు దేవునికి బంగారు కిరీటాలు, ముత్యాల హారాలు, ఒడ్డాణాలు కానుకలుగా ఇస్తారు. నాయకులైతే వారి పాపాలు కడిగేసుకోవడానికి అనేక మొక్కులు మొక్కుతారు. అదే దరిద్రులు అయితే కనీసం కొబ్బరిచిప్ప కూడా ఇవ్వలేరు. ఆధిపత్య, అణగారిన వర్గాల్లో ఎంత తేడా ఉందో! వారిని జనం ఎలా తేడాగా చూస్తారో! దేవుడు కూడా అలాగే వివక్షతతో చూస్తాడని ఒక పాత్రతో వెటకారంగా కథకుడు చెబుతాడు. కరోనా సంక్షోభంలో గుళ్ళూ గోపురాలు మూసేసారు. ప్రజల్ని రక్షించాల్సిన భగవంతుడే దాక్కున్నాడు. ’అంటే కరోనా మనుసుల్ని కాదు, దేవున్నీ జడిపించీసింది’ అని దైవం ఆనవాళ్ళని ఈ కథలో ప్రశ్నిస్తాడు. పట్టణంలో ఉన్న కొడుక్కి తన రేషన్ బియ్యం పంపాలంటే రూల్స్ ఒప్పుకోవని వలంటీరు అంటున్నాడు. దానికి ఆమె ’రూల్సు ప్రెకారమే ఈ గండల గవర్మెంట్ నడస్తందా? రూల్సు ప్రెకారమే గద్దెలెక్కిన గండలిలాగ మేడలూ మిద్దెలూ కట్టెస్తండ్రా? భూమీ, పుట్టలు సంపాయిస్తండ్రా? రూల్సట రూల్సు’ అని చెడాపెడా రాజ్యం నిర్వాకాన్ని తప్పుబడతాడు. పట్టణాల్లో వలస జీవులు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడి పోతుంటే, ఇక్కడ పల్లెల్లో వారి తల్లుల ఎలా తల్లడిల్లి పోయారో! అన్న విషయాన్ని హృద్యంగా ఎరుకు పరుస్తాడు.

‘శ్రేయోభిలాషి’ లో కథకుడు సుదీర్ఘ చరిత్ర గల భారతదేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యాలను అర్ధవంతంగా చర్చిస్తాడు. రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక యుగం వరకు జరిగిన కల్లోల భారతాన్ని పూసకొచ్చినట్లు పరోక్షంగా చెబుతాడు. భూస్వామ్య జమీందారీ వ్యవస్థలోని ఆధిపత్య ధోరణులను, లోపాలను-వలస సామ్రాజ్యవాదుల క్రౌర్యాన్ని, అణచివేతలను- పెట్టుబడిదారీ వర్గాల దమననీతిని, మోసాలను-ప్రజాస్వామిక వాదులమనే ముసుగులో పబ్బం గడుపుతున్న వారి దుర్నీతిని ఎండగడుతూ కథాకథనం ఉంటుంది. నెహ్రూవియాన్ పాలిటిక్స్, ప్రజా సంక్షేమం-గాంధీల పాలనా రీతులు, వైఫల్యాలు-వామపక్షవాదుల ఉద్యమ ప్రస్థానం, లోపాలు-విపక్షాల అనైక్యత, అస్థిరత-సుస్థిర పాలన మాటున కషాయ మూకలు సృష్టించే దౌర్జన్యాలు, దాష్టీకాలు వరుసపెట్టి మనముందు పెడతాడు.

ప్రజలు దేవున్ని నమ్ముతారు. పాలకులు దైవమనే మాయను ప్రజలకు అంటించి తద్వారా తమ రాజకీయ స్థానాలను పదిలిపరుచుకుంటారు. ఒకప్పుడు ప్రజలు భూస్వామ్యులు, డాక్టర్లు, లాయర్లు, బ్రాహ్మణులను నాయకులుగా ఎంపిక చేసుకునేవారు. నేడు అందుకు భిన్నంగా రియల్టర్లను, లిక్కర్ కింగ్ లను, స్మగ్లర్లను, క్వారీ కాంట్రాక్టర్లను, లాడ్జింగ్ హౌసెస్ మరియు హోటల్స్ నడిపే వాళ్లను నాయకులుగా ఎన్నుకుంటున్నారు. కానీ పేద అణగారిన వర్గాలకు నాయకత్వ బాధ్యతను అందివ్వడానికి ఏ ఒక్కరూ ఒప్పుకోవడం లేదు. పూర్తిగా నోటుకు, సారాకి ఓటును అమ్మే స్థితికి దిగజారి పోవడం పట్ల ఏవగించుకుంటాడు.

ఈ సంపుటిలో ‘ఎన్నెలో ఎన్నెలా, దయ్యపు భరోసా, చీడపీడలు, ఆందోళన జీవులు, లోక కళ్యాణార్ధం, పితలాటకం, తెగువ, సుడి-చురక, వేకువ పొద్దున, చల్లచుక్క, పిడికిలి, జీవితము-ప్రపంచము, చిటికెన వేలు’ వంటి కథలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ఈ కథలన్నీ జనాన్ని చైతన్య పరుస్తూ వేలుపట్టి ముందుకు నడిపిస్తాయి. వర్తమాన ఉద్యమాల్లో పాల్గొనేలా చేస్తాయి.

‘గండడు, దడిగట్టి, మిటకరించడం, మూర్తం, మెడజివ్వల, జాగా,కుటమాం, అప్మానం, గాచ్చారం, ఒకపాలి, బొట్టిడు,గర్రా, ఇగటం, వొల్లకోవడం, తీట్రివ్వ, తపేళాలు, బెడ్డ, సల్లంది, వతనకీ, అక్రమానంగా, మొగదలకు, ఒంజిడు, మిట్టగిడుసు, దద్ద, దుక్కమొజ్జు, కొసకీ, పర్రాకులు, పితలాటకం, గాడుపు, తుప్పాడొంకా, డమాబుస్, గవినేరు, అడ్డుసుడి, పిక్కిరోళ్ళు, గెంటు’ మొదలగు ఉత్తరాంధ్ర మాండలిక పద శబ్దార్ధ శోభ తాండవిస్తోంది.

‘ఊరూ, ఊరబిండి చట్టీ! ఏ ఊరయితేటి?, దరిద్రుడు తల కడిగితే వొడగళ్ళ వోనట, యముడెనకాల దమయంతిలాగ నడస్తండేటి?, పూటబత్తెం పుల్లలెలుగు, సుడి ఒక్కాడా చురక ఒక్కాడా, మంటలో కాలి ఆరిపోయిన తుమ్మమానులా నల్లగా, పోలీసోళ్లతో గొడవ పీతిమీద రాయేసినట్టుగా, పెణకమీదికి రాయేసి వీపు కాసినట్టుగా, మంగళ్లకి జేబుల డబ్బులాడితే చేతుల్లో కత్తెర ఆడదన్న, ఊరంతా బీరపీచులా బంధుత్వం, నక్కల అలికిడికి బెదిరిన కోళ్లు రెక్కలు కొట్టుకుని యెగిరేట్టు’ లాంటి సామెతలు మరియు పదబంధాలు పఠితులను పరవశింపజేస్తాయి. మొత్తంగా చూస్తే ఈ కథా సంపుటి ప్రగతిశీలవాదులకు ఆసక్తిగా, ఆసరాగా నిలుస్తుంది.

పిల్లా తిరుపతిరావు,
7095184846

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News