Thursday, May 2, 2024

పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి..

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలీలో గల వైమానిక స్థావరంపై సాయుధులైన తొమ్మిది మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారు జామున దాడి చేశారు. సైన్యం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపి వారిని హతమార్చింది. ఉగ్రవాదుల దాడిలో వైమానిక స్థావరం లోని కార్యాచరణలో ఉన్న ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని, ఆపరేషన్‌లో లేని మూడు యుద్ధ విమానాలు మాత్రమే ధ్వంసమయ్యాయని పాక్ ఎయిర్ ఫోర్స్ ( పిఎఎఫ్) వెల్లడించింది. ఈ పేలుళ్లు తమ పనేనని తెహ్రిక్ ఏ జిహాద్ ఉగ్రసంస్థ ప్రకటించింది. అయితే ఫైటర్ జెట్లు ఉన్న స్థావరం లోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారు జామున చొరబాటుకు ప్రయత్నించారని, తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పీఎఎఫ్ ధ్రువీకరించింది. ఈ దాడిని ఆపద్ధర్మ ప్రధాని అన్వారుల్ హక్ తీవ్రంగా ఖండించారు.

దేశ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి ప్రయత్నమైనా తిరుగులేని ప్రతిఘటనతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కల్లోలిత ప్రాంతం బెలూచిస్థాన్, కైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌ల్లో శుక్రవారం వరుసగా ఉగ్రదాడులు కొనసాగి కనీసం 17 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో తాజాగా ఈ దాడి జరిగింది. శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఈ సంఘటనల వెనుకనున్న శత్రువు ఒకటేనని పాక్ అంతర్గత మంత్రి సర్‌ఫ్రాజ్ బగ్తీ పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరం చేయడానికే జరుగుతున్న కుట్రలో భాగమే ఈ వరుస దాడులుగా ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేయడమనేది శనివారం నాడు మొదటిదేం కాదు. 2015 సెప్టెంబర్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మసీదులో ప్రార్థనలు చేస్తున్న 16 మందితోసహా మొత్తం 29 మందిని హతమార్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News