రాజకీయ జన్మనిచ్చిన జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్‌లో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ఎంఎల్‌ఎ కడియం శ్రీహరిని మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ తాటికొండ రాజయ్య సూటిగా ప్రశ్నించారు. శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అధికార మదంతో తనపైన, తన కార్యకర్తల పైన తప్పుడు ఆరోపణలు చేసే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. నియోజకవర్గంపై ప్రేమ ఉంటే తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలోలా కడియం శ్రీహరి దొంగ లెక్కలు రిలీజు చేశారని, రూ. 800 కోట్ల అభివృద్ధి అన్నది కేవలం బోర్డులపైనే ఉందనిచ వాస్తవానికి కేవలం రూ.31 కోట్ల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయని అన్నారు. అందులో సగం పనులకు బిల్లులు రాలేదని అన్నారు. 100 పడకల ఆసుపత్రి, నీటి ఎత్తిపోతల పథకం ఇవన్నీ బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు వచ్చినవేనని అంటూ ఈ సందర్భంగా కడియం శ్రీహరి రిలీజ్ చేసిన కాగితాన్ని కాల్చేశారు. కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రిగా ఉన్నపుడే స్టేషన్ ఘన్‌పూర్‌కు రాలేదని ఆయనే ఒప్పుకున్నారని, ఇంకెలా స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధి చేస్తారని అన్నారు.
‘నువ్వు ఎంఎల్‌ఎగా ఉన్నపుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా.. నేను ఉన్నపుడు జరిగిందా అన్నది ఏ గ్రామానికైనా వెళ్లి ప్రజల ముందే నిరూపించుకుందాం’ అని కడియంకు సవాల్ విసిరారు. కెసిఆర్ కృషితోనే దేవాదుల సహా 7 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, వాటి వల్లే రైతులకు రెండు పంటలకు నీళ్లు లభించాయని అన్నారు. కెసిఆర్ వంటి మహానేతను మోసం చేసి ఇప్పుడు అబద్ధాలు చెబుతుండటం సిగ్గుచేటన్నారు. ‘అభివృద్ధి కోసం పార్టీ మారాలి అంటే నీ బిడ్డ బిజెపిలోకి వెళ్లాలి కదా. నీకు ఒక న్యాయం.. నీ బిడ్డకు మరో న్యాయామా’ అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి బినామీ పేర్లపై కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. మోసం చేయకపోతే ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించగలిగారని అన్నారు. ఒక నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం ఆపాలన్నారు. ‘దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలి.. అప్పుడే ప్రజలే నిర్ణయిస్తారు. నువ్వు మంచోడివా.. నేను మంచోడినా’ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు మాచర్ల గణేష్, ఆకుల కుమార్, సురేష్ కుమార్‌తోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also REad: రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు