Thursday, May 9, 2024

మహిళపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నగలు చోరీ

- Advertisement -
- Advertisement -

Gold

బెంగళూరు: చోరీకి వచ్చిన ఒక దొంగ ఇంట్లోని వారిని పెట్రోల్‌తో తగలబెడతానని బెదిరించి రూ. 4 లక్షల విలువైన నగలతో ఉడాయించాడు. ఈ భయానకమైన దొంగతనం బెంగళూరులో ఇటీవల చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఒక రిటైర్డ్ పోలీసు అధికారి కుమార్తె కావడం, ఆ ఇంట్లోనే నలుగురు పోలీసు శాఖలో పనిచేస్తుండడం గమనార్హం. స్థానిక వినాయక నగర్‌లో నివసించే 36 ఏళ్ల ఆశారాజ్ తన కుమార్తెతో కలసి ఇంట్లో ఉండగా జనవరి 11వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. ముఖానికి నల్ల రంగు పులుముకున్న ఆ వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ముందు తలుపునకు లోపల నుండి గొళ్లెం పెట్టి ఆమె మీదకు ఏవో ప్యాకెట్లు విసరసాగాడు.

నేల మీద పడి పగిలిపోయిన ఆ ప్యాకెట్ల నుంచి పెట్రోల్ వాసన వచ్చింది ఆమెకు. అయితే ఆ దొంగను అడ్డుకోవడానికి ఆమె తన చేతికందిన వస్తువులను అతని పైకి విసిరేసింది. కాగా, ఒక పెట్రోల్ ప్యాకెట్ ఆమె శరీరానికి తగిలి పెట్రోల్ ఆమెపై పడింది. ఇంతలో అతను అగ్గిపెట్టె వెలిగించి ఆమె మీదకు విసిరేస్తానని బెదిరించాడు. అంతేగాక కత్తితో ఆమె కుమార్తెను పొడిచేస్తానని బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిన ఆశారాజ్ ఇంట్లో నగదు ఏదీ లేదని చెప్పగా ఆమె శరీరంపై ఉన్న బంగారు తీసి ఇవ్వాలని అతను చెప్పాడు.

దీంతో ఆమె తాను వేసుకున్న ఒక బంగారు గొలుసు, రెండు జతల బంగారు గాజులు, చెవిపోగులు తీసి ఇచ్చింది. పోలీసులకు చెబితే నిప్పుపెడతానని బెదిరించి అతడు అక్కడి నుంచి ఉడాయించాడు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రకమైన దొంగతనం నగరంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదని చెప్పారు. సిసిటివి కెమెరాలో దొంగ మొహం చిక్కిందని, దొంగను పట్టుకునేందుకు గాలింపు జరుపుతున్నామని వారు వివరించారు.

Thief snatches jewellery hurling petrol at woman, the robber barged into a house and hurled petrol packets and threatened to set her on fire

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News