Friday, May 3, 2024

మూడోసారి కెసిఆరే ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

బిజెపి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే కారణం
మోహన్ భగవత్ చేతిలో గాంధీభవన్ రిమోట్
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మూడో సారి కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. ఎంఐఎం పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తామని మిగితా స్థానాల్లో బిఆర్‌ఎస్ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చేపారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమ ంలో అసదుద్దీన్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వల్లే కేంద్రంలో బిజెపి గెలుస్తూ వస్తోందని ఆయన ఆరోపించారు. బిజెపి విజయానికి తనను బాధ్యుడిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ నా పై దుష్ప్రచారం చేస్తోందని అసదుద్దీన్ విమర్శించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రారంభమయ్యిందని ఓవైసి అన్నారు. గాంధీభవన్ రిమోట్ ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. బిజెపితో పారాడేది తాము మాత్రమేనని, ఇక ముందు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బిఆర్‌ఎసు బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం హైదరాబాద్ లో తొమ్మిది నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను నిలిపింది. ‘ ఈ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. మా స్థానాలను తిరిగి కైవసం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అజారుద్దీన్ విఫలమైన రాజకీయ నేత
అజహరుద్దీన్ పై పోటీఎంఐఎం పోటీ చేయడాన్ని రాజకీయం చేయవద్దని అసదుద్దీన్ అన్నారు. ఇతర నియోజవర్గాల్లో ఒకే కులానికి చెందిన ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల నుండి పోటీ చేస్తున్నా ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. నాంపల్లి లో ఎంఐఎం అభ్యర్థులపై ఎందుకు పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అజహరుద్దీన్ ఓ మంచి క్రికెటర్ అని అయితే అతను అసమర్థ రాజకీయ నాయకుడని విమర్శించారు. మురాదాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.

హెచ్‌సిఎ ఆయన హయాంలో అదోగతి పాలైందన్నారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ అభ్యర్థి గోపీనాథ్ ఏ మాత్రం నియోజకవర్గం కోసం పని చేయలేదని అసదుద్దీన్ అన్నారు. మాగంటి గోపీనాథ్ ప్రజలకు కనపడకుండా పోయారంటూ ఎద్దేవా చేశారు. అందుకే జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం బలమైన అభ్యర్థి ని బరిలో నిలబెట్టిందన్నారు. బిజెపి చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వాయినాడ్‌లో ముస్లీంలీగ్ సహకారంతో గెలిచారని ఓవైసి తెలిపారు. తాము అమెథీలో పోటీ చేయకున్నా ఓడిపోయిన రాహుల్ తాము పోటీ చేస్తే ఓటమికి తమపై విమర్శలు చేసేవారని విమర్శించారు.

గోషామహల్‌లో తమ పార్టీ ఎప్పుడూ పోటీ చేయలేదని, జూబ్లీహిల్స్‌లో(అప్పటి ఖైరాతాబాద్ నియోజకవర్గం) సలాఉద్దీన్ ఓవైసి కాలం నుండి ఎంఐఎం పోటీ చేస్తూ వస్తోందని చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనారిటీలకు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని, కర్ఫూలకు ఆస్కారం లేని శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కాంగ్రెస్ హాయంలో మతకలహాలు, కర్ఫూలు జరిగేవని విమర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 80 శాతం స్కాలర్‌షిప్‌లను రద్దు చేసిందని చెప్పారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు సుప్రీం ఆదేశానుసారమే అమలవుతున్నాయని, అవి మతపరమైన రిజర్వేషన్లు కావని బిజెపి అబద్దాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

బిజెపిది రెండు నాల్కల ధోరణి..
బిఆర్‌ఎస్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు డబ్బులు ఇచ్చిందంటున్న మోడీ తన వద్దకు వచ్చి ఆశీర్వాదం కోరారంటూ రెండు నాల్కల ధోరణినవలంభిస్తున్నాడని విమర్శించారు. బిజెపి తెలంగాణలో హంగ్ అసెంబ్లీ కోసం ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని బిజెపి చూస్తోందని తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని అసదుద్దీన్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News