Saturday, April 27, 2024

బయోమెట్రిక్‌పై ప్రిన్సిపాళ్లకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

Biometrics

 

ఒయులో విడతలవారీగా అవగాహన కార్యక్రమం
ప్రస్తుత సెమిస్టర్‌లోనే అమలుకు చర్యలు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ, పిజి కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుపై ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఒయు అనుబంధ గుర్తింపు కలిగిన డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, బి.ఇడి, ఎం,ఇడి, లా, బి.ఫార్మసీ, ఎం. ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ కళాశాలలు సుమారు 700 వరకు ఉన్నాయి. ఈ కళాశాలల ప్రిన్సిపాళ్లకు విడతలవారీగా మూడు రోజుల పాటు బయోమెట్రిక్ హాజరుపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన అవగాహన కార్యక్రమం గురువారంతో ముగియనుంది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కళాశాలలకు సర్కులర్ జారీ చేశారు. .కళాశాలల యాజమాన్యాలు వెంటనే బయోమెట్రిక్ యంత్రాలు అమర్చుకోవాలని, లేదంటే యూనివర్సిటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు బయోమెట్రిక్ యంత్రాలు అమర్చుకోవడం, ఈ విధానంపై ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరి
ఉస్మానియా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో జూన్ నుంచి ప్రారంభం కానున్న నూతన విద్యాసంవత్సరం నుంచి కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు కా నుంది. ఆలోపే ప్రస్తుత సెమిస్టర్ విద్యాసంవత్సరం కూ డా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందు కు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత సెమిస్టర్‌లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయడం ద్వారా ఏమైనా లోపా లు ఉంటే గుర్తించి సరిచేసుకునేందుకు అవకాశం ఉం టుంది. అయితే ఈ సెమిస్టర్ బయోమెట్రిక్ హాజరు విధానంతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న పేపర్ హాజరు విధానం కూడా సమాంతంగా అమలు చేయనున్నారు.

రోజుకు రెండు సార్లు
బయోమెట్రిక్ హాజరు విధానంలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు రోజుకు రెండు సార్లు తమ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం బయోమెట్రిక్ ఇచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు మళ్లీ ఆరు గంటల తర్వాత బయోమెట్రిక్ ఇస్తేనే ఆ రోజు హాజరైనట్లు పరిగణిస్తారు. మూడు గంటల తర్వాత బయోమెట్రిక్ ఇస్తే ఒక పూట హాజరైనట్లుగా పరిగణిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అన్ని రకాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా ఈ విధానంలోనే తమ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కళాశాలల్లో విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తాయి. లేనిపక్షంలో అవి నిలిచిపోతాయి. దాంతోపాటు 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే పరీక్షలకు అనుమతిస్తారు. హాజరు శాతం తక్కువగా విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఆగిపోవాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమించిన కళాశాలపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే గుర్తింపును కూడా రద్దు చేసేందుకు ఒయు సన్నద్ధమవుతోంది.

కళాశాలల ఆగడాలకు కళ్లెం
ఉస్మానియా వర్సిటీ పరిధిలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో కొన్ని కోర్సుల్లో సీట్లు మిగిలిపోతే ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను బ్రతిమాలి, వారికి రకరకాల తాయితాలు ప్రకటించి కళాశాలల్లో చేర్చుకునే వారు. కళాశాలకు రానవసరం లేకుండా నేరుగా పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేవారు. అయితే బయోమెట్రిక్ హాజరు విధానం అమలుతో కళాశాలల ఆగడాలకు చెక్ పెట్టేందుకు వర్సిటీ చర్యలు చేపడుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లతో పాటు విద్యార్థులను పరీక్షలకు అనుమతివ్వాలన్నా 75 శాతం హాజరు తప్పనిసరి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్యుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే 65 శాతం హాజరు ఉన్నా అనుమతిస్తారు. లేనిపక్షంలో కోర్సు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

ఇదివరకు విద్యార్థులు కళాశాలలకు రాకపోయినా డబ్బులు తీసుకుని సరిపడే హాజరు శాతం ఉన్నట్లు యూనివర్శిటీలకు పంపేవారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును మార్చే అవకాశం ఉండదు. ఇక నుంచి ఇలాంటి అక్రమాలు నిరోధించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేసతున్న అధ్యాపకులు రెండు మూడు కళా శాలల్లో పని చేస్తున్నట్లు గతంలో ప్రభుత్వం నిర్వ హించిన తనిఖీల్లో వెల్లడైంది. దాంతోపాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అధ్యాపకులు లేకున్నా ఉన్నట్లు చూపుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాగితాలపై అధ్యాపకులను చూపిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి బోగస్ అధ్యాపకులకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానమే సరైన మార్గమని భావించిన వర్సిటీ, దాని అమలుకు చర్యలు చేపడుతోంది.

Training of Principals on Biometrics
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News