Friday, September 19, 2025

కవ్వాల్ రిజర్వు ఫారెస్టులో 200 చెట్లను నరికిన ఆదివాసీలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా, కవ్వాల్ రిజర్వు ఫారెస్టులోని పాలగోరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇతరులకు అనుమానం రాకుండా జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సుమారు 200 వరకు చిన్నా, పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది నరికివేతను అడ్డుకోవడంతో ఆదివాసీలు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఇందన్‌పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధరాచారి తెలిపారు. చెట్లను నరికివేయకుండా ఎప్పటికప్పుడు రాత్రి, పడలు అనే తేడా లేకుండా తమ సిబ్బంది అక్కడే మకాం వేసి ఉండడంతో వారి కండ్లు కప్పి మూకుమ్మడిగా చెట్లను నరికివేశారని తెలిపారు. నరికివేతను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని, తమ సిబ్బందిని ఆదివాసీలు బెదిరించారని తెలిపారు.

చెట్లను నరికివేసిన 50 మంది ఆదివాసీలపై అటవీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సైతం 50 మందిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, కవ్వాల్ డిఆర్‌ఒ విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివాసీలపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ అనూష తెలిపారు. చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని సాయంత్రం లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ తహసోద్దీన్‌‚ సందర్శించారు. అనవసరంగా అడవిలోకి ప్రవేశించి చెట్లను నరికివేయడం తగదని, ఇప్పటికైనా మానుకోవాలని, లేకుంటే చూస్తూ ఊరుకోబోమని సిఐ హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కాని చెట్లను నరికివేయడం తగదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News