Friday, May 3, 2024

విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా దేవర్ ఫస్లావాద్ లోొ స్టార్టర్ వైర్లు సరిచేస్తుండగా ఘటన

ఒకరిని కాపాడబోయి మరొకరు మృత్యు ఒడిలోకి

మన తెలంగాణ/దౌల్తాబాద్ : వ్యవసాయ పొలం దగ్గర బోరు మోటార్ స్టాటర్ వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తుషాక్‌కు గురవ్వగా అది గమనించిన మరొవ్యక్తి అతడిని కాపాడాలనే తాపత్రయంతో తాను విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని దేవర్‌పస్లావాద్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రమేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని దేవర్‌ఫస్లావాద్ గ్రామానికి చెందిన నత్త వెంకటయ్య (54) గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంలో బోరు మోటారు సహాయంతో వరి పంటను సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. దేవర్‌ఫస్లావాద్ గ్రామ పక్కనే గల లొట్టికుంట తాండాకు చెందిన చందర్‌నాయక్ (49) సైతం వెంకటయ్యకు చెందిన పొలం పక్కనే వ్యవసాయ పొలం ఉంది. చందర్‌నాయక్‌కు బోరుబావి లేకపోవడంతో వెంకటయ్య బోరు బావి సహాయంతో తన పొలంలో వరి పంటను సాగు చేసుకున్నాడు.

ప్రతి రోజు మాదిరిగానే శనివారం ఉదయం ఇరువురు తమ పొలాలను పరిశీలించడానికి వెళ్ళారు. ఈ క్రమంలో బోరు మోటారుకు చెందిన స్టాటర్ దగ్గర వైర్లు ఇబ్బందికరంగా ఉండడంతో వాటిని సరిచేసేందుకు వెంకటయ్య వెళ్ళాడు. వైర్లు సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్తుషాక్ తగిలి వెంకటయ్య గిలగిల కొట్టుకోవడం గమనించిన చందర్‌నాయక్ ఆ వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి తానూ కూడా విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన పక్కపొలం వ్యక్తి కృష్ణ గ్రామస్తులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్సై రమేష్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామాను నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన కృష్ణ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏది ఏమైనా పొలాల దగ్గర కలిసి మెలిసి తిరుగుతూ అన్నదమ్ముల్లా కలిసి వ్యవసాయం చేసుకునే ఇద్దరు వ్యక్తులు ఒకే సారి ప్రమాదవశాత్తు విద్యుత్తుషాక్‌కు గురై మృతి చెందడంతో ఇరువురి గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News