Saturday, December 2, 2023

యుద్ధానికి ఏడాది

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తి అయింది. అయినా ఆ మహా మానవ విషాదం ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. రష్యా ఏకపక్ష దాడిగా మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు రష్యా అమెరికాల మధ్య నువ్వా నేనా అనే స్థాయికి చేరుకొన్నది. అమెరికా వొత్తిడికి లొంగి యూరపు దేశాలు కూడా రష్యాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఆహారం, ఇంధనం తదితర సరఫరాలకు ప్రపంచమంతటా అంతరాయం ఏర్పడి జీవన వ్యయాన్ని విపరీతంగా పెంచి వేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను బోనులో నిలబెట్టి నిందించిన అమెరికా కూడా ఇప్పుడు యుద్ధం కొనసాగడానికి కారణమవుతున్నది. ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష, పరోక్ష ఆయుధ, ఆయుధేతర సహాయాలన్నింటినీ అందించడం ద్వారా రష్యాతో రణాన్ని నిరవధికంగా కొనసాగింపజేస్తున్నది.

యుద్ధం వల్ల ఇప్పటికి 8006 మంది ఉక్రెయిన్ పౌరులు దుర్మరణం పాలయ్యారని, 13,287 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కెర్ టర్క్ మంగళవారం నాడు ప్రకటించారు. సరఫరాలకు తీవ్ర విఘాతం కలిగి చలికాలంలో విద్యుత్తు, నీటి కొరతలు ఎదురై దాదాపు కోటి ఎనభై లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారని, మరి కోటి నలభై లక్షల మంది స్వస్థలాలు విడిచిపెట్టి నిర్వాసితులై తీవ్ర జీవన వ్యధ అనుభవిస్తున్నారని ఆయన వివరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో 30 మంది రష్యన్లు మరణించారని, 130 మంది గాయపడ్డారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పౌరులను ఈ మారణ హోమం నుంచి, విధ్వంసం నుంచి కాపాడాలంటే తక్షణం జరగాల్సింది రెండు వైపుల వారు చర్చలకు కూర్చోడమే. అమెరికాకు గాని, నాటోకి గాని, చివరికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గాని ఈ కర్తవ్య స్పృహ కలిగిన జాడలు బొత్తిగా కనిపించడం లేదు.

ఇప్పటికీ రష్యాదే యుద్ధంలో పైచేయిగా వున్న మాటను ఎవరూ కాదనలేరు. యుద్ధం దీర్ఘ కాలం కొనసాగి అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు విశేషంగా సరఫరాలు అందితే రష్యా తలవొంచక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చుగాని ఇప్పటికైతే అటువంటి సూచనలు లేవని అమెరికా అనుకూల సైనిక నిపుణులే చెబుతున్నారు. అమెరికా, నాటో కలిసి తూర్పు యూరపులో తిష్ఠ వేసి ఉక్రెయిన్‌కు విశేషంగా ఆయుధ సరఫరాలు అందిస్తున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలు రష్యాను కొంత దెబ్బ తీశాయి. అయితే రష్యన్ ఆయిల్, గ్యాస్‌పై అమితంగా ఆధారపడి వున్న యూరపు దేశాలు విపరీతంగా నష్టపోతున్నాయి.రష్యన్ గ్యాస్ దిగుమతిని మానుకోడం వాటికి సాధ్యం కావడం లేదు. ప్రతి రోజూ వందలాది మిలియన్ డాలర్లను రష్యాకు చెల్లించి గ్యాస్‌ను దిగుమతి చేసుకొంటున్నాయి.

అమెరికా ఇంత వరకు ఉక్రెయిన్‌కు 53 బిలియన్ డాలర్ల విలువైన సైనిక, ఆర్థిక, మానవతా సహాయాన్ని అందించింది. యుద్ధానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌ను సందర్శించారు. ఇది నిస్సందేహంగా యుద్ధాన్ని రెచ్చగొట్టే చర్యే. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మాట్లాడారు. రష్యాను ఏ విధంగానైనా దెబ్బ తీయడం కోసం 500 మిలియన్ డాలర్ల అదనపు సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించనున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాలు రష్యాను బెదిరిస్తున్నందున తాము ఉక్రెయిన్‌పై దాడికి దిగాల్సి వచ్చిందని చెప్పుకొన్నారు. మాస్కో సేనలు ఎటువంటి కవ్వింపు లేకుండా ఉక్రెయిన్‌పై దాడికి దిగాయనడం అసత్యమని ప్రకటించారు. యుద్ధాన్ని మొదలు పెట్టింది వారేనని దానిని అంతమొందించడం కోసమే తాము దాడికి దిగవలసి వచ్చిందని చెప్పుకొన్నారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా వున్నామని అందుకు అవతలి పక్షమే సిద్ధంగా లేదని అన్నారు. అమెరికా అండతో ఉక్రెయిన్ సేనలు చేస్తున్న ఎదురు దాడుల వల్ల రష్యా నష్టపోతున్న మాట వాస్తవం. స్వల్ప కాలంలో ముగిసిపోతుందనుకున్న యుద్ధాన్ని అదే పనిగా కొనసాగించవలసి రావడం రష్యన్ సైనికుల స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్న మాట కాదనలేనిది.

అయితే పుతిన్ రాజీపడే సూచనలు బొత్తిగా లేవు. పర్యవసానంగా కొనసాగే యుద్ధం వల్ల ఉక్రెయిన్ పౌరుల కష్టాలు మరింత పెరుగుతాయి. అలాగే సరఫరాలకు అంతరాయం కలిగి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సమస్యలను ఎదుర్కొంటారు. యుద్ధాన్ని మరింత బీభత్సమైన మలుపు తిప్పడానికి ఉక్రెయిన్ జీవాయుధాలను, అణ్వాయుధాలను కూడా సమీకరిస్తున్నదని పుతిన్ ఆరోపించారు. అలాగే రష్యా, చైనాలు కలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకు రావచ్చునని జెలెన్‌స్కీ అన్నారు. అమెరికా, రష్యాల మధ్య ఆయుధ పరిమితి కోసం జరగవలసి వున్న తదుపరి చర్చలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు పుతిన్ తాజాగా చేసిన ప్రకటన రెండు బలమైన అంతర్జాతీయ శక్తుల మధ్య మరింత ప్రతిష్టంభనను సృష్టిస్తుంది. ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది. అందుచేత ఈ రెండు ధ్రువాలకు చెందని ఇతర దేశాలు ఒక్కటై యుద్ధ విరమణ వైపు వొత్తిడిని పెంచవలసిన అవసరం ఎంతైనా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News