Saturday, July 27, 2024

వినోద్ చౌదరీ.. వీడు సామాన్యుడు కాడు

- Advertisement -
- Advertisement -

Vinod Chaudhary 9 Guinness World Records Computermen

9 గిన్నీస్ రికార్డుల కంప్యూటర్‌మెన్
ముక్కుతో శరవేగపు స్పీడ్ టైప్
కళ్లకు గంతలతో, నోట్లో పుల్లతో
ఒక్క వేలుతో …టెన్నిస్ బాల్‌తో
19 ఘనతల సచిన్ సరసన చేరే తపన

న్యూఢిల్లీ : ఎవరైనా ముక్కుతో అత్యంత వేగంగా కంప్యూటర్‌పై టైప్ చేస్తారా? 2014లో అత్యంత వేగంగా ముక్కుతో టైప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించాడు ఓ వ్యక్తి. ఆయనే నోటిలో పుల్ల పెట్టుకుని అత్యంత వేగపు టైప్ ఘనుడు అయ్యాడు. ఇక కళ్లకు గంతలు కట్టుకుని టైప్‌లో వేగంగా దూసుకుపొయ్యాడు. ముక్కుతో కేవలం 46.30 సెకండ్లలోనే 103 అక్షరాలు కొట్టేసి, భళా అన్పించుకున్నాడు. ఆ తరువాత మరింత వినూత్న పంథాలు వెతుక్కున్నాడు. 2016లో రెండు రికార్డులు స్థాపించాడు. పూర్తిగా కళ్లకు గంతలు కట్టుకుని అన్ని ఇంగ్లీషు అక్షరాలను కేవలం 6.71 సెకండ్లలో టైప్ చేసి అపూర్వ రికార్డు సాధించాడు. ఈ ఏడాదే ఆయన అన్ని అక్షరాలను కేవలం 6.09 సెకండ్లలోనే కొట్టేసి తన రికార్డును తానే అధిగమించాడు. దీనికి ఏడాది పాటు ప్రాక్టిస్ చేశాడు. సాంఘికశాస్త్రంలో ఎంఎ చేసిన ఈ వ్యక్తి 2017లో నోటిలో పుల్ల పెట్టుకుని అన్ని అక్షరాలను కేవలం 18.65 సెకండ్లలో కొట్టి ప్రపంచరికార్డు స్థాపించాడు.

ఇదే రికార్డుతో సరిపెట్టుకోకుండా మరుసటి ఏడాది 2018లోనే ఇదే ఘనతను కేవలం 17.69 సెకండ్‌లలో సాధించి తన సత్తాను తనే మరోమారు ఇంతకు ముందటి కన్నా ఎక్కువస్థాయిలో సాధించాడు. ఇంతటితో ఆగుతాడా? ఇదే ఫీటును 2019లో కేవలం 17.01 సెకండ్లలో చేసి చూపించి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇక ఇదే ఏడాది ఈ వ్యక్తే మరో విధంగా తన రికార్డుతో గిన్నిస్ పేజీలోని రికార్డుల అధ్యాయంలోకి చేరాడు. ఒక్క వేలితో అన్ని అక్షరాలను కేవలం 29.53 సెకండ్లవేగంతో కొట్టి అపూర్వ చరిత్ర సాధించారు. ఇప్పటికీ 9 గిన్నిస్‌లు సొంతం చేసుకున్నా, ఆయనకు తనివి తీరలేదు. ఏకంగా 19 గిన్నిస్ రికార్డులు స్థాపించి , ఇప్పటి వరకూ ఈ విశిష్ట రికార్డుతో ఉన్న సచిన్ తెండూల్కర్ సరసన చేరాలని అనుకుంటున్నట్లు సవినయంగా తెలిపారు. ఇంతటితో ఆగేది లేదు. పలు వినూత్న ప్రయోగాలతో పలు విధాలుగా టైప్‌తో ఆటాడుకుంటానని తెలిపాడు. అయితే ఈ గెలుపు సులువు కాదని, నిరంతర ప్రాక్టిస్ అవసరం అన్నాడు.

ఢిల్లీ శివార్లలోని నాంగ్లోయి వాసి అయిన ఈ వ్యక్తి రికార్డుల చిట్టాలో చిట్టచివరి రికార్డు చాలా విచిత్రంగా ఉంది. టెన్నిస్ బాల్‌ను నేలకు కొట్టి నిమిషంలో 205 సార్లు చేతితో తాకాడు. ఇది ప్రపంచస్థాయి రికార్డుఅయింది. ఈ అద్బుతం చేస్తానని చెప్పినప్పుడు గిన్నిస్ వారు నిమిషానికి 180 సార్లు టచ్ చేసే టార్గెట్‌పెట్టారు. అయితే దీనిని దాటేసి ముందుకు దూసుకుపొయ్యాడు. లాక్‌డౌన్ దశలో దీనిని చేసి చూపించాడు. ఇంతకూ ఎంతో సైలెంట్‌గా ఉండే ఈ వ్యక్తి వినోద్‌కుమార్ చౌదరీ …వయస్సు 41 ఏండ్లు. అంతే.. వృత్తి స్థానిక జెఎన్‌యూలో కంప్యూటర్ ఆపరేటర్. అంతా ఆయనను కేవలం డాటా పంచింగ్‌ల వ్యక్తి అనుకుంటారు. అయితే ఆయన తొమ్మిది ప్రపంచ స్థాయి గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. జెఎన్‌యుకు చెందిన ఎస్‌ఇఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్ అయిన వినోద్ తన ఇంట్లో పేద పిల్లలు, వికలాంగులు నేర్చుకునేందుకు ఉచిత కంప్యూటర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

కంప్యూటర్‌పై స్పీడ్‌గా టైప్ చేసి తనదైన చరిత్ర సృష్టించాలని చిన్నప్పటి నుంచి తనలో తపన ఉంటూ వచ్చిందని, ఇదే తనను ముందుకు దూసుకుపొయ్యేలా చేస్తుందని వినోద్ తన విజయరహస్యం తెలిపారు. తన లక్షం సొంతంగా అయితే కంప్యూటర్‌పై చిత్ర విచిత్రాలతో రికార్డులు సాధించడం. ఇక సామాజికంగా అయితే పూర్తి స్థాయి వనరులు హంగులతో ఉన్న కంప్యూటర్ సెంటర్ పెట్టి విద్యార్థులకు కంప్యూటర్ మెళకువలు ఉచితంగా నేర్పడమే అని తేల్చిచెప్పారు. తనకు ఆర్థిక పరిమితులు ఉన్నాయని, వీటిని దాటి తన సెంటర్‌ను పూర్తిస్థాయిలో విస్తరించాలనేదే విస్తృత ఆలోచన అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News