Wednesday, May 29, 2024

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

- Advertisement -
- Advertisement -

 Vote

 

కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు

నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా
గోదావరి జలాలు తీసుకొచ్చాం
మూడేళ్లలో రైలు వస్తుంది
32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం
అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం
కెసిఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు

వేములవాడ రాజన్న గుడికి వెళితే పదవులు పోతాయని సమైక్య పాలనలో నిందలు వేశారు
సిఎం కెసిఆర్ 4 సార్లు రాజన్నను దర్శించుకున్నారు
గొప్ప శైవక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
గుడి చెరువును గోదావరితో నింపాం, మిడ్ మానేరును పూర్తి చేశాం, రాజరాజేశ్వర సామి రిజర్వాయర్‌గా నామకరణం చేసిన ఖ్యాతి కెసిఆర్‌దే
ప్రతిపక్షాలకు వేసే ఓటు వృథా

మన తెలంగాణ/ సిరిసిల్ల/ వేములవాడ : సిరిసిల్లను అన్ని విధాల అభివృద్ధి చేసిన తమకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసి, అఖండ విజయాన్ని అందించాలని పురపాలక, ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృధ్ధి శాఖల మం త్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరారు. సిరిసిల్లలో శనివారం కెటిఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జరిగిన సభలో కెటిఆ ర్ ప్రసంగించారు. ఎన్నికల వేళ కుల, మతాలు, బంధుత్వా ల గురించి ఆలోచించ వద్దని, బంధువులు ఇంటికి వస్తే మంచి భోజనం పెట్టాలని, పని చేసేవారికి మాత్రమే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

సిరిసిల్లను అన్నివిధాల అభివృద్ధి చేసిన తమకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్లకు గోదావరి జలాలు తెచ్చామని చెప్పారు. మరో మూడేళ్లలో సిరిసిల్లకు రైలును రప్పించే బాధ్యత తనదని ఆయన తెలిపారు. సిరిసిల్లను విద్యాకేంద్రంగా మార్చే క్రమంలో జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పరిశ్రమలు తెచ్చి సిరిసిల్లను అభివృధ్ధి చేస్తానన్నారు. అపెరల్ పార్క్‌లో పదివేల మంది మహిళలకు ఉపాధి కల్పించే పనులు త్వరలోనే పూర్తి అవుతాయని ఆయన వెల్లడించారు. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరెలు, ఆర్‌విఎం వస్త్రాలు తయారు చేసే ఆర్డర్లు ఇచ్చామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌వైపే ఉన్నారన్నారు. సామాజిక కోణంలోనే మున్సిపల్ ఎన్నికల బి ఫాంలు ఇచ్చామన్నారు. సిఎం కెసిఆర్ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని ఆయన టిఆర్‌ఎస్ నేతలకు సూచించారు.

సిరిసిల్ల మున్సిపల్‌లో ఉన్న 39 వార్డుల్లో 32 వార్డులు బలహీన వర్గాలవారికే ఇచ్చామన్నారు. 91 శాతం సీట్లు బిసిలలోని అన్నికులాలను ఆదరించేలా టికెట్లు ఇచ్చామన్నారు. సమాజంలోని అన్ని కులాలను ఆదరించడం రాజకీయ పార్టీగా చేయక తప్పదన్నారు. సిరిసిల్లలో ఇంకా రెబల్స్‌గా పోటిలో ఉన్న వారు ఇప్పటికైనా తన మాటను మన్నించి విరమించుకుంటే వారికి కూడా తగిన న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి నెలకు రూ.10 వేల కోట్లు ఆసరా పెన్షన్లుగా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎలక్షన్ల సమయంలో కుల,మతాలను ప్రస్తావించడం మంచిది కాదని, అలా వచ్చేవారిని చూసి ఆగం కావద్దని ఆయన పేర్కొన్నారు. పని చేసేవారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. తంగళ్లపల్లి మానేరు వంతెన కిందకు గోదావరి నీరు తెచ్చామని ఆయన చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారిందని, కలెక్టర్, ఎస్‌పి సిరిసిల్లలోనే ఉండి సేవలందిస్తున్నారని అన్నారు.

ఆడ బిడ్డలకు బతుకమ్మ ఘాట్, ఆధునిక శ్మశానం, అందమైన గ్రంథాలయ భవనం, పార్కులు, జంక్షన్లు, కరకట్ట, కొత్త చెరువు అభివృధ్ధి ఇలా అనేక పనులు చేశామని కెటిఆర్ చెప్పారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. గతంలో సిరిసిల్లలో వారానికి ఐదారుగురు ఆత్మహత్యలు చేసుకునే వారని, ఇప్పుడు సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందని కెటిఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో టిఆర్‌ఎస్ ఏకపక్షంగా విజయం సాధించడం ఖాయమని ఆయన తెలిపారు. దేశంలోనే సిరిసిల్లను అగ్రశ్రేణి పట్టణంగా మారుస్తానన్నారు. 3 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టామని, ప్రతి పేదకు ఇల్లు ఇచ్చే పూచీ తనదని ఆయన వెల్లడించారు. రాయుని చెర్వులో 3 వేల పట్టాలిచ్చామన్నారు. మున్సిపల్ కొత్త చట్టాన్ని బాగా అవగాహన చేసుకోవాలన్నారు. గెలిచిన కౌన్సిలర్ల పనితీరు బాగా లేకుంటే ముందుగా టిఆర్‌ఎస్ వారినే తొలగిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టిఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, నేతలు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, గడ్డం నర్సయ్య, తోట ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టంతో మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌కు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆలయం ముందు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సభలో కెటిఆర్ మాట్లాడారు. సమైక్య పాలనలో వేములవాడ పట్టణాన్ని అభివృద్ది చేయలేదని ఆయన విమర్శించారు. రాజన్న ఆలయానికి వెళితే పదవులు పోతాయనే నింద వేశారని ఆయన ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ వేములవాడకు నాలుగుసార్లు వచ్చి రాజన్నను దర్శించుకున్నారని గుర్తు చేశారు. యాదాద్రి పనులు పూర్తవుతున్నాయని, రాజన్న ఆలయాన్ని గొప్ప శైవక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

గోదావరి జలాలతో పట్టణంలోని గుడి చెరువు నింపామని, మిడ్‌మానేరును పూర్తిచేసి , రాజరాజేశ్వర స్వామి రిజర్వాయర్‌గా నామకరణం చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని కెటిఆర్ చెప్పారు. జలాశయంతో పాటు నాంపల్లి, రామప్ప గుట్టలను పర్యాటక కేంద్రాలుగా మార్చుతామని ఆయన హామీ ఇచ్చారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే వృథా అవుతుందని, గాడిదకు గడ్డి వేసి, ఆవుకు పాలు పితికితే రావని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై నీతి అయోగ్ సంస్థ ప్రశంసలు కురిపించి, రాష్ట్రానికి రూ.19వేల కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి మోడీకి సూచించిందని, అయితే మోడీ ప్రభుత్వం కనీసం 19పైసలు కూడా ఇవ్వలేదని కెటిఆర్ విమర్శించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతు కోసం రూ.లు 5వేల కోట్లు వెచ్చించామని, నీతి అయోగ్ సూచించినా కూడా కేంద్రం ఒక్క పైసా మంజూరు చేయలేదని ఆయన మండిపడ్డారు.

మున్సిపల్ కొత్త చట్టంలో భాగంగా అభివృద్దిపై ఎన్నికైన అభ్యర్థులకు ముందే శిక్షణ ఇచ్చి, అవినీతికి తావులేకుండా పని చేయిస్తుందని ఆయన తెలిపారు. పురపాలక సంఘంలో కలిసిన విలీన గ్రామాలకు ప్రత్యేక నిధుల కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిపక్షాలు కులం, మతం పేరున రాజకీయాలు చేస్తున్నాయని, వాటికి అతీతంగా టిఆర్‌ఎస్ పనిచేస్తుందని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్, టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

We have right to ask for Vote
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News