Thursday, May 30, 2024

తడిసిన ధాన్యం కొంటాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మ ద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ ధర తగ్గిస్తే, తగ్గిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. తాగునీటి  కోసం నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ రాష్ట్రానికి 2.25 టీఎంసీలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పంట చేతికొచ్చే తరుణంలో అకాల వర్షాలు, రైతులను కలవరపెడుతున్నాయి. ఐకేపీ విక్రయ కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈ నేపథ్యంలో బుధవారం పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతు నష్టపోతే, దానికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని ప్రభుత్వం అత్యవసర అంశంగా పరిగణిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పగడ్భందీగా నడుస్తున్నాయని అందుకు కావాల్సిన మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించినట్లు చెప్పారు.

రైతుల నుంచి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకునే సమయంలో ధర తగ్గితే ఆ తగ్గిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. మిల్లర్లు తరుగు తీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది ఇదే సమయానికి 13.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇప్పుడు 24.85 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు కొనుగోలు చేసామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులను మూడు నాలుగు రోజులకే చెల్లిస్తున్నామని తెలిపారు. తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తాగునీటి కోసం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటి నుంచి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా, 2.25 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందని పూర్తి నివేదిక రావాల్సి ఉందని, వారం పది రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News