Friday, September 19, 2025

అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పార్టీ ఫిరాయింపులపై జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్‌ఎ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించను అంటూనే బిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేశారు. శుక్రవారం హన్మకొండలోని హరిత కాకతీయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో 36 మంది ఎంఎల్‌ఎలను చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆరోపించారు. అప్పుడు లేని విలువలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అంటూ గులాబీ నేతలను ప్రశ్నించారు. వాళ్ళు చేస్తే సంసారం..వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అని వ్యాఖ్యానించా. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను కెసిఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉన్నదని స్పష్టం చేశారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

తాను పదవుల కోసం పాకులాడే వాడిని కాదని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. బిఆర్‌ఎస్‌లో గెలిచినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే అధికార పార్టీతోనే సాధ్యమని అన్నారు. అందుకే గడిచిన 21 నెలలుగా కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నట్లు చెప్పారు. కొద్దిరోజులుగా బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. కొంతమంది స్థాయిని మరచి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు మంచిది కాదని హితవు పలికారు. వాళ్ళ లాగా తనకు కూడా మాట్లాడటం వచ్చని.. కానీ తాను చదువుకున్న చదువు, సమాజంలో ఉన్న మర్యాద వల్ల మాట్లాడేందుకు సభ్యత అడ్డువస్తోందని అన్నారు. వారి వ్యాఖ్యలను వారి వారి విజ్ఞతకే వదిలేస్తున్నన్నానని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని కూడా దిగజారుడుగా మాట్లాడుతున్నారని పరోక్షంగా మాజీ ఎంఎల్‌ఎ రాజయ్య, జనగామ ఎంఎల్‌ఎ పల్లాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయ విధానాలపై, అభివృద్ధి పనులపై మాట్లాడితే సమాధానం చెప్పవచ్చు కానీ ఇలాంటి దిగజారుడు మాటలకు కాదన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయని విమర్శించారు.

Also Read: విషాదం: హీరోయిన సదాకు పితృవియోగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News