కమెడియన్ ప్రవీణ్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం బకాసుర రెస్టారెంట్. (Bakasura Restaurant) హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హారర్, థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్స్ సహా అన్నీ రకాల అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ , షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నటుడు ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది.
ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో వినోదంతో పాటు భావోద్వేగం కూడా ఉంటుంది. ఈ కథలో హారర్, థ్రిల్లర్, మైథాలజీ.. (Horror Thriller Mythology) ఇలా అన్నీ మిక్స్ అయ్యాయి. ఐదు పాత్రలున్న కథను నడిపించే పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది. అయితే ఈ సినిమాను దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. ఇదొక కాన్సెప్ట్ కథ. తిండిబోతు దెయ్యం పెట్టే ఇబ్బంది చాలా ఎంటర్‌టైనింగ్‌గా.. ఎమోషనల్‌గా ఉంటుంది. నిర్మాత శిరీష్ సినిమా చూసి మంచి కథను ఎంచుకున్నారని అన్నారు. సినిమా ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఎస్వీసీ ద్వారా సినిమాను విడుదల చేస్తున్నాం”అని అన్నారు.