Sunday, April 28, 2024

కంటి వెలుగుకు 100 రోజులు పూర్తి

- Advertisement -
- Advertisement -
సచివాలయంలో కేక్ కట్ చేసిన మంత్రుల సంబురాలు
పాల్గొన్న ఉన్నతాధికారులు, వైద్యారోగ శాఖ సిబ్బంది

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శనివారానికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు సంబురాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి వైద్యారోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకొని, లక్ష్యానికి మించి కంటి పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

నివారింపదగిన, అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి కంటి వెలుగును ప్రసాదించిందన్నారు. ఎవరూ అడగక ముందే ఈ పథకం ప్రారంభించి, మానవత్వాన్ని చాటుకున్న గొప్ప మనసు సిఎం కెసిఆర్‌ది అని పేర్కొన్నారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారు.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి(25.1 శాతం) మందికి గ్లాసెస్ పంపిణీ చేశారు. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందజేశారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కూడా ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టిఎస్‌ఎంఎస్ ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ స్వరాజ్య లక్ష్మి, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News