Sunday, April 28, 2024

స్వచ్చమైన ప్రేమకు మారు పేరు హైదరాబాద్: శేఖర్ కమ్ముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ముత్యాలు, బిర్యానికే కాకుండా హైదరాబాద్ మహానగరం స్వచ్ఛమైన ప్రేమకు మారుపేరని ప్రఖ్యాత తెలుగు సినీ దర్శకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల అన్నారు. కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్.. సీఈసీ, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్… యూజీసీ…. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 24వ జాతీయ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ తో కలిసి ఠాగూర్ ఆడిటోరియంలో కిక్కిరిసిన విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దివంగత ప్రధాని పీవీ నరసింహ్మారావు, అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ, మహ్మద్ అజారుద్దీన్, హర్షా భోగ్లే, శ్యామ్ బెనగల్ లాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులను అందించిన ఉస్మానియాలో సీఈసీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించటం ఆనందంగా ఉందని శేఖర్ కమ్ముల ఆనందం వ్యక్తం చేశారు. సార్వత్రిక, దీర్ఘకాలిక ఆకర్షణతో సినిమాలు నిర్మించటం, వీక్షకుల మనసుల్లో చెరగని ముద్రలు వేయటానికి చలనచిత్ర నిర్మాతలు సమాజానికి బాధ్యత వహిస్తారని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా విద్యారంగ చలన చిత్ర నిర్మాతలను ప్రోత్సహించటంలో సీఈసీ – యూజీసీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు, యువత తాము నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు.

మూడు రోజుల పాటు ఓయూలో జరిగే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ను విద్యార్థులు, అధ్యాపకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డ్బ్బై ఏళ్ల స్వతంత్ర భారత్ లో విద్యార్థుల నమోదులో స్థూల జాతీయ సగటు కేవలం 27 శాతమేనని.. రానున్న పన్నెండేళ్లలో మరో 23శాతం విద్యార్థుల నమోదును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా చెప్పారు. ఇందుకోసం సంప్రదాయ విద్యావిధానం మాత్రమే సరిపోదన్న ఆయన… సమాంతరంగా డిజిటల్ విద్యావిధానం అవసరమని స్పష్టం చేశారు. ఈ పనిని పూర్తి చేసేందుకు కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్… సీఈసీ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న డిజిటల్ విశ్వవిద్యాలయాలకు డిజిటల్ కంటెంట్ సీఈసీ అందిస్తుందని వివరించారు.

ప్రతిష్టాత్మక 24వ సీఈసీ యుజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించే అవకాశాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇచ్చిన ప్రొఫెసర్ జేబీ. నడ్డాకు ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీరాములు, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ శ్రీనివాసులు సహా ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు, డీన్లు, బీఓఎస్ లు, ఆయా విభాగాల డైరెక్టర్లు, బోధన, బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News