ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం (ఆగస్టు 5) ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలి, సుఖీ అనే గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా మెరుపు వరద ధరాలి గ్రామాన్ని సగం తుడిచిపెట్టేసిసింది. కళ్లముందే ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెత్తుతున్న వారిని వరద రాకాసిలా ముంచెత్తింది. దీంతో పదుల సంఖ్యలో జనాలు బురదలో కూరుకుపోయారు. ఇండ్లు, హోటళ్లను బురద ముంచెత్తింది. దాదాపు 25 హోటళ్లు కొట్టుకుపోయాయి. వరద కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఉత్తరకాశి నుండి గంగోత్రికి బయలుదేరుతున్న సమయంలో వారు చివరిసారిగా తమతో మాట్లాడారని.. ఇప్పుడు వారి ఫోన్లు పనిచేయడం లేదని పర్యాటకుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంఘటనాస్థలంలో ప్రస్తుతం భారత సైన్యం, ITBP, NDRF, SDRF బృందాల నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ వరదలతో కొట్టుకుపోయిన రోడ్లు, కూలిపోయిన వంతెనల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ధరాలి నుండి ఇప్పటివరకు 130 మందికి పైగా ప్రజలను రక్షించారు. అయితే, కేరళ పర్యాటక బృందం ఆచూకీ ఇంకా తెలియలేదు.