Thursday, May 2, 2024

రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ

- Advertisement -
- Advertisement -

త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ
పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు
బీమా నిబంధనలు సరళీకృతం
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూ 3.86లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెల కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల అధికారులతో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డైరెక్టర్ రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, సిఇఒ మంజువాణి తదితరులు పాల్గొన్నారు. కులవృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సబ్సిడీ పై గొర్రెలు, పాడి గేదెలను పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. ఇవి ప్రమాదవశాత్తు మరణిస్తే లబ్దిదారులు నష్టపోకుండా ఆదుకునేందుకు బీమ చేయడం జరిగిందని తెలిపారు.

మొదటి దశలో గొర్రెల బీమా కు ఉన్న కఠిన నిబంధనలను సరళీకృతం చేసినట్లు పేర్కొన్నారు. గొర్రెలు కానీ, పాడి గేదెలు కానీ ప్రమాదవశాత్తు మరణిస్తే త్వరితగతిన క్లెయిమ్ సెటిల్ చేసి లబ్దిదారుడికి అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన గొర్రెలు, పాడి గేదెల పంపిణీ , 2 వ విడత పంపిణీ ప్రక్రియ ను, దాంతో పాటు బీమా పతకాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లను రాబోయే 15 రోజులలో పరిష్కరించి లబ్దిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 3,86,366 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, డిడిలు చెల్లించిన లబ్దిదారులకు కూడా త్వరలో గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మిగిలిన లబ్దిదారులకు వీలైనంత త్వరగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని అన్నారు. లబ్దిదారులు తమ వాటాధానం నిధుల డిడిలను సంబంధిత పశువైద్యాధికారులకు అందజేయాలని కోరారు. నిబంధనల ప్రకారం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు.

గొర్రెల కొనుగోలు ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో లబ్దిదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని చెప్పారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పాడి గేదెల కోసం డిడిలు చెల్లించిన వారికి కూడా పాడిగేదెలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగానికి సమాంతరంగా రైతులకు ఆర్ధిక స్వావలంభన అందించే పాడి రంగం ద్వారా ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అధికారుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని, తదనుగుణంగా డెయిరీ, పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి, వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు , గోపాలమిత్ర లతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాల ఉత్పత్తిని పెంపొందించడానికి తగిన కార్యాచరణ రూపొందించి వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.

నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ లపై ఫుష్ కార్ట్ ల ద్వారా విజయ ఐస్ క్రీం లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డెయిరీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరిjకీ అందాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందించేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యాకారుడిని మత్స్య సొసైటీ లలో సభ్యుడిగా నమోదయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మత్స్యకార సొసైటీ లలో ఉన్న సభ్యులందరికీ సహకార చట్టంలోని అంశాలపైన, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపైన, వారి అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మత్స్య శాఖ కు ఇటీవల బదిలీ అయిన గ్రామ పంచాయితీ చెరువులు, కుంటలకు సంబంధించిన లీజు మొత్తాన్ని నిర్ణయించుటంలో భాగంగా సమగ్రమైన సమాచారం కోసం ఉన్నత అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి తర్వాత జరిగే జెఎసి సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మత్స్యకార సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన జెఎసి కమిటీ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం జెఎసి ఏర్పాటు చేసిన తర్వాత అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనగలిగామని, ప్రతినిధులతో తరువాత సమావేశం మార్చి 2 వ వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మిగిలిన అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News