Tuesday, April 30, 2024

కొండెక్కిన పేదల చదువులు!

- Advertisement -
- Advertisement -

37% students in rural areas, 19% in urban not studying

 

మనిషికి తగలే దెబ్బ కొద్ది రోజుల్లోనో, మాసాల్లోనో నయమై మాయమైపోవచ్చు. ఒక జాతికి కలిగే నష్టం పూడడానికి, భర్తీ కాడానికి మాత్రం ఏళ్లూ, పూళ్లూ పట్టిపోతాయి. అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి సాధించుకున్న ప్రగతి ధ్వంసమైపోతే దానిని పునరుద్ధరించుకోడానికి చాలా కాలం పడుతుంది. జనాభాలో అత్యధిక సంఖ్యాకులైన పేద, దిగువ మధ్యతరగతి వర్గాల పిల్లల చదువు ఇప్పటికే అధ్వానంగా ఉంది. ఎన్నో సర్వేలలో ఈ విషయం రుజువైంది. పదో తరగతి చదువుకునే పిల్లలకు కూడా లోప రహితంగా చదవడం, రాయడం రాదని తేలింది. కేవలం పై వర్గాలు చదువుకున్నంత మాత్రాన ఏ దేశమూ, ఏ జాతీ బాగుపడిపోదు. అన్ని వర్గాల ప్రజలు విద్యావంతులైన చోటనే ప్రగతి విలసిల్లుతుంది. మూలిగే నక్క మీద పిడుగు పడిన విధంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న పేద పిల్లల చదువులు కరోనా లాక్‌డౌన్ల కారణంగా మరింత అడుగంటిపోయాయని, చాలా మంది ప్రాథమిక స్థాయి పేద విద్యార్థులు చదువులకు పూర్తిగా దూరమైపోయారని వెల్లడైన వాస్తవం అత్యంత బాధాకరమైనది. 6 నుంచి 14 ఏళ్ల వయసులోని పిల్లల్లో సగానికి తక్కువ మంది మాత్రమే బడికి వెళుతున్న కొవిడ్‌కి ముందరి స్థితి లాక్‌డౌన్ల కారణంగా మరింత దిగజారుడుకు గురైందని బోధపడుతున్నది.

15 రాష్ట్రాల్లో పేద పిల్లలు చదువుకునే 1362 పాఠశాలల్లో ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు జీన్ డ్రెజె, రీతికా ఖేరాలతో కూడిన ఒక బృందం నిర్వహించిన తాజా సర్వేలో బాలల విద్యకు సంబంధించి అనేక బాధాకరమైన విషయాలు బయటపడ్డాయి. గ్రామీణ పేద పిల్లల్లో 37 శాతం మంది కొవిడ్ వల్ల చదువుకి దూరమైపోగా, పట్టణాల్లో 19 శాతం మంది పేద బాలలు బడులు మానేశారని ఈ సర్వే వెల్లడించింది. వారిలో కేవలం 8 శాతం మందికే ఆన్‌లైన్ విద్య అందుబాటులో ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన పిల్లల్లో 48 శాతం మంది ఒకటి రెండు పదాలను మాత్రమే చదవగలిగారంటే వారికి బడిలో చెబుతున్న విద్య నాణ్యత ఎంత గొప్పదో తెలుస్తున్నది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత తమ పిల్లలు చదవడం, రాయడం పూర్తిగా మరిచిపోయారని 65 శాతం మంది తలిదండ్రులు ఫిర్యాదు చేశారంటే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎంత చక్కగా వర్ధిల్లుతున్నదో వివరించనక్కర లేదు. ఎస్‌సి, ఎస్‌టి పిల్లల చదువును కొవిడ్ లాక్‌డౌన్లు కోడి పిల్లలను ఎత్తుకుపోయే గద్దల్లా తన్నుకుపోయాయి.

ఈ సర్వేను బట్టి ఇతర సామాజిక వర్గాలకు చెందిన గ్రామీణ బాలల్లో 15 శాతం మందికి ఆన్‌లైన్ విద్య అందుబాటులో ఉండగా, ఎస్‌సి, ఎస్‌టి బాలల్లో 4 శాతం మందికే ఆ అవకాశం లభిస్తున్నది. ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న ప్రాంతాల్లోనే ఈ సర్వేను నిర్వహించారు. పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశిస్తున్నప్పటికీ ఆచరణలో మామూలు రోజుల్లోనే వారు తలిదండ్రులతో పాటు వ్యవసాయ తదితర పనులకు వెళిపోతుంటారు. వేన్నీళ్లకు చన్నీళ్లలా అంతో ఇంతో కూలి సంపాదించి తలిదండ్రులకు తోడ్పడుతుంటారు. వీరిని బడికి రప్పించడం కోసమే మధ్యాహ్న భోజన పథకం అవతరించింది. అయినా పేద పిల్లల విద్యా ప్రమాణాలు పెరగడం లేదు. చివరి వరకు చదువుకోడం లేదు. మామూలుగానే ఒకటో తరగతిలో చేరే పేద పిల్లల్లో మూడింట ఒక వంతు మంది మాత్రమే ఎనిమిదో తరగతి వరకు చదువుతున్నారు. ఇప్పటికే 614 సంవత్సరాల వయసులోని 3 కోట్ల 50 లక్షల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. 5 9 ఏళ్ల వయసులోని ఆడపిల్లల్లో 53 శాతం మందికి బడి ముఖం తెలియదు.

ప్రభుత్వాలు ఎన్నో కొత్త విద్యా పథకాలు, విధానాలను ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో అవి పేదల పిల్లలను చదువు వైపు ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి. 614 ఏళ్ల పిల్లలందరికీ విద్యా హక్కును కల్పిస్తూ తెచ్చిన చట్టం నిష్ఫలమైపోతున్న చేదు వాస్తవం కాదనలేనిది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) నివేదిక ప్రకారం 13 ఏళ్ల వయసులోని 3 కోట్ల 20 లక్షల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. వీరిలో మెజారిటీ సామాజికంగా అణగారిన వర్గాలకు చెందిన వారే. పేద పిల్లల పరిస్థితి ఇలా ఉంటే వారికి నాణ్యమైన విద్య నేర్పే టీచర్ల కొరత కూడా దేశాన్ని బాధిస్తున్నది. ఐదో తరగతి చదువుతున్న పేద పిల్లల్లో 50 శాతానికి మించి కనీసమైన విద్యా ప్రమాణాలు లేవని అనేక సర్వేల్లో వెల్లడైంది. వీరు 2, 3 తరగతుల వాచకాలను కూడా చదవలేకపోతున్న పరిస్థితి రుజువైంది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి తరగతి గదులు, ఫ్యాన్లు, టాయిలెట్లు వంటి సదుపాయాలు బొత్తిగా లేకపోడం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొవిడ్ వల్ల పేద పిల్లల విద్య మరింతగా దిగజారిపోడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. విద్యను పేద, ధనిక తేడాల్లేకుండా పిల్లలందరికీ ఉన్నత ప్రమాణాల్లో అందేలా చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల కనీస బాధ్యత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News