డబ్లిన్: ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యహంకార దాడి జరిగింది. బాలికపై ఆమె ఇంటి సమీపంలో కొందరు దుండగలు దారుణంగా దాడి చేసి.. “భారతదేశానికి తిరిగి వెళ్ళిపో” అంటూ బెదిరించారు. చిన్నారి ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో ఆగస్టు 4 సాయంత్రం చిన్నారి తన ఇంటి సమీపంలో స్నేహితులతో ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కొంతమంది అబ్బాయిలు, ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఓ అమ్మాయి దాడి చేసినవారిలో ఉన్నారని తెలిపింది. ఎనిమిది సంవత్సరాలుగా ఐర్లాండ్‌లో నివసిస్తూ నర్సుగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల అక్కడి పౌరసత్వం కూడా పొందినట్లు చెప్పింది. తన 10 నెలల కొడుకుకు ఆహారం ఇస్తుండగా.. అదే సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న తన ఆరేళ్ల కూతురిపై దాడి చేశారని తెలిపింది. “నేను తమ్ముడికి ఆహారం ఇచ్చి ఒక క్షణంలో తిరిగి వస్తానని తన కూతురికి చెప్పి వెళ్లాను. కొద్దిసేపటి తర్వాత వెళ్లగా.. తన కూతురు ఏడుస్తూ కనిపించింది. చాలా భయపడి ఏం మాట్లాడలేకపోయింది. తన కూతురు స్నేహితురాలు మాట్లాడుతూ.. ఐదుగురు అబ్బాయిలు ఆమె ముఖంపై గుద్దారని, ఒకరు ఆమె ప్రైవేట్ భాగాల్లోకి సైకిల్ చక్రం తోసారని చెప్పింది. దాడి చేసిన వ్యక్తులు ఆమెను “డర్టీ ఇండియన్” అని, జాతిపరమైన దూషణలు చేశారని, దుర్భాషలాడారని తెలిపింది. దాడి తర్వాత తన కుమార్తె బయటకు వెళ్లడానికి భయపడుతుంది. భయం లేకుండా తాను ఆడుకోగలదని అనిపించడం లేదు. దాడి చేసిన అబ్బాయిల గుంపు మా ఇంటి పరిసరాల్లో తిరుగుతూ.. నన్ను చూసి నవ్వుతున్నారు. నేను ఆ చిన్నారి తల్లినని వారికి తెలుసు. దాడి చేసిన పిల్లలకు శిక్ష విధించాలని కోరుకోవడం లేదు.. వారికి కౌన్సెలింగ్, సరైన మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తున్నా” అని పేర్కొంది.