బ్రెజిల్ సావో పాలో రాష్ట్రంలో ఒకగేటెడ్ నివాస భవనాల సముదాయంలో శుక్రవారం ఒక ప్రయాణికుల విమానం కూలిపోగా విమానంలోని 61 మందీ మరణించారని, ఆ ప్రాంతంలో పొగల మధ్య శిథిలాలు కనిపించాయని అధికారులు, సంస్థ వోపాస్ అధికారులు వెల్లడించారు. సావో పాలోకు వాయువ్యంగా దాదాపు 80 కిలో మీటర్ల దూరంలోని విన్‌హెడో నగరంలో విమానం కూలిన ప్రదేశంలోని నివాసులలో ఎవరైనా మరణించారా అన్నది అధికారులు తెలియజేయలేదు. కానీ, దుర్ఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు స్థానిక నివాసుల్లో మృతులు ఎవరూ లేరని చెప్పారు. తమ విమానం ఎటిఆర్ 72 రెండు ఇంజన్ల టర్బోప్రాప్ 57 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయం గ్వారుల్‌హోస్‌కు వెళుతుండగా విన్‌హెడోలో పతనమైందని వోపాస్ తెలియజేసింది.
విమాన సంస్థ ప్రయాణికుల పేర్లతో జాబితా విడుదల చేసింది. అయితే, వారి జాతీయతను సంస్థ వెల్లడించలేదు. నిరుడు జనవరి తరువాత ఎక్కువ మంది మరణించిన విమాన ప్రమాదం ఇది. నిరుడు జనవరిలో నేపాల్‌లో యెతి ఎయిర్‌లైన్స్ విమానం ఎటిఆర్ 72 దిగే సమయంలో కూలిపోగా 72 మంది మృతి చెందారు. దక్షిణ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లులా డ సిల్వా ఒక కార్యక్రమంలో ఈ విమాన ప్రమాద వార్తను తెలియజేస్తూ ఒక నిమిషం మౌనం పాటించవలసిందని సభికులను కోరారు. ఆయన శుక్రవారం సాయంత్రం మూడు సంతాప దినాలు ప్రకటించారు. విమానం బ్లాక్ బాక్స్‌ను వెలికితీసినట్లు సావో పాలో భద్రత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.