Thursday, May 2, 2024

కర్నాటకలో 72శాతం ఓటింగ్

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో 72 శాతం ఓటింగ్
స్వల్ప ఘర్షణలు.. మొత్తం మీద ప్రశాంతం
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో బుధవారం 72 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ సంపూర్తి సమయానికి ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే పోలింగ్ శాతంపై రాత్రి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మందకొడిగా సాగిన ఓటింగ్ ఆ తరువాత వేగం పుంజుకుంది. ఉడుపి జిల్లాలో మధ్యాహ్నానికే అత్యధికంగా 50 శాతం వరకూ ఓట్లు వేశారు.

పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా సాగింది. విజయపురాలో పోలింగ్ అధికారిపై దౌర్జన్యానికి దిగిన 23 మందిని అరెస్టు చేశారు. కర్నాటకలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం మీద 58,545 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 224 స్థానాల అసెంబ్లీలో 2615 మంది వివిధ పార్టీల అభ్యర్థులు రంగంలో నిలిచారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి, జెడిఎస్ మధ్య సాగింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దాదాపుగా 73 శాతం వరకూ ఓట్లు పోలయ్యాయి.

ఈసారి కేవలం 70 శాతం వరకూ ఓట్లు నమోదు కావచ్చునని భావిస్తున్నారు. బళ్లారిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు తలపడ్డారు. బెలగావి జిల్లాలో 70 ఏండ్ల మహిళ పోలింగ్ క్యూలైన్‌లో నిలబడి ఉండగా కుప్పకూలి మృతి చెందారు. చిక్కోలోలో 49 ఏండ్ల జయన్న ఓటేసి బయటకు వచ్చిన తరువాత మృతి చెందాడు. కారణం తెలియలేదు. కొన్ని చోట్ల ఇవిఎంలను తీసుకువెళ్లుతున్న వాహనాలను అడ్డగించారు. అధికారులను కొట్టారు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ 72 శాతం ఓట్లు పోలయ్యాయని, బిజెపికి స్పష్టమైన మెజార్టీ తధ్యం అని తెలిపారు. ఇది క్షేత్రస్థాయిలో తమకు అందిన సమాచారం అన్నారు.

కుర్లగింది గ్రామంలో పోలింగ్ బూత్‌లో ప్రసవం
బళ్లారిలోని కుర్లగింది గ్రామంలో ఓ గర్భవతి పోలింగ్ బూత్‌లోనే ప్రసవించింది. అధికారిణులు, తొటి మహిళా ఓటర్లు సాయం చేసిన దశలో 23 ఏండ్ల యువతి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ఎన్నికలలో తొలిసారి ఓటుహక్కు పొందిన వారు, వృద్ధులు ఎక్కువగా ఓటేసేందుకు వచ్చారు. కొత్త ఓటర్లు ఉత్సాహంతో కన్పించారు. తొలిసారి ఓటర్లు ఈసారి దాదాపు 12 లక్షల మంది వరకూ ఉన్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద వయస్సు మీదపడ్డ వారు అలసటను పక్కకు పెట్టి తమ ఓటును సార్థకం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News