Saturday, September 20, 2025

రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను(రిజిష్టర్డ్ అన్‌రికగ్నైజ్‌డ్ పొలిటికల్ పార్టీ..ఆర్‌యుపిపి) రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో డీలిస్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పార్టీలన్నీ నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందలేదని, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం- 1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని సుదర్షన్ రెడ్డి వివరించారు. రద్దయిన పార్టీలు ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి,

భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలకు చెందినవే. వీటిలో నాలుగు పార్టీలు హైదరాబాద్‌కు, మరో నాలుగు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాకు, ఒకటి భద్రాద్రి -కొత్తగూడెం జిల్లాకు చెందినది. ఈ పార్టీలను రద్దు చేసినట్లుగా జిహెచ్‌ఎంసి కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించామని తెలిపారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కాపాడటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రద్దయిన పార్టీల్లో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బిసి ఒబిసి పార్టీ, బిసి భారత దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నాయి.

10 పార్టీలకు నోటీసులు.. గుర్తింపు రద్దు హెచ్చరిక
రాష్ట్రంలో నమోదైన 10 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు(ఆర్‌యుపిపి) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటి కార్యకలాపాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అక్టోబర్ 10లోపు సమాధానం ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సెప్టెంబర్ 19న ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను నోటీసులు అందజేయాలని, జాతీయ-స్థానిక పత్రికలలో ప్రచురణతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు నిర్దిష్ట ఫార్మాట్‌లో సవివరమైన నివేదికలు తయారు చేసి, ఈ పార్టీలు కొనసాగించాలా లేదా గుర్తింపు రద్దు చేయాలా అన్న దానిపై స్పష్టమైన సిఫారసులు ఇవ్వాలని సిఇఒ ఆదేశించారు.

నోటీసులు అందుకున్న పార్టీలు
బహుజన రాష్ట్రమ్ సమితి (హైదరాబాద్),
ఇండియన్ రక్షక నాయకుడు పార్టీ (నారాయణపేట),
జై మహా భారత్ పార్టీ (జోగులాంబ గద్వాల్),
జై స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి),
మజ్లిస్ మార్కజ్- ఏ-సియాసీ పార్టీ (హైదరాబాద్),
నవ ప్రజా రాజ్యం పార్టీ (ఆదిలాబాద్),
న్యూ ఇండియా పార్టీ (పెద్దపల్లి),
ప్రజా స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి),
శ్రమజీవి పార్టీ (మేడ్చల్-మల్కాజిగిరి),
తెలంగాణ ఇంటి పార్టీ (నల్గొండ)

Also Read: యువత రాజకీయాల్లోకి రావాలి:కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News