Tuesday, April 30, 2024

తెలంగాణ యాపిల్ పండింది !

- Advertisement -
- Advertisement -

Apple Cultivation

 

ఆదిలాబాద్ జిల్లా కెరమెరి అటవీ ప్రాంతంలో సాగు
నెల రోజుల్లో కోతకు వస్తుందని కెటిఆర్, సంతోష్, కవితకు ట్వీట్ చేసిన రైతు

మన తెలంగాణ/హైదరాబాద్: మినీ కశ్మీరంలా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా‌లోని ఉట్నూర్ మండలం, కెరమెరి అటవీప్రాంతంలో తెలంగాణ యాపిల్ నెల రోజుల్లో కోతకు రానున్నది. ప్రస్తుతం ఒక్కోచెట్టుకు 40 వరకు కాయలు కాసినట్లు యాపిల్ తోట రైతు కొడాటి జితేందర్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యాపిల్ తోటలో దిగిన ఫోటోలను మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దీలిప్‌కు ట్యాగ్ చేశారు. రాష్ట్రంలో యాపిల్ సాగుకు కొన్ని ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. గత ఏడాది నుంచే మార్కెట్‌లోకి ఈ యాపిల్స్ వస్తున్నాయి. కేంద్రే బాలజీ అనే రైతు ఇప్పటికే యాపిల్ సాగులో విజయవంతమయ్యాడు.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు యాపిల్ పండేందుకు అనుకూలంగా ఉన్నాయి.వాణిజ్య పరంగా పండించేందుకు ఎన్‌ఐఎఫ్ అనుమతి కూడా ఉంది. జనవరిలో ఫ్లవరింగ్ వస్తుంది. జూన్‌లో యాపిల్స్ వస్తాయి.రాత్రి వేళలో 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. యాపిల్ మొక్కలు నాటిన ఐదు సంవత్సరాల తరువాత పండ్లు వస్తాయి. వాస్తవానికి యాపిల్ పంటకు ఎక్కువ వేడి ఉండకూడదు. పొగమంచు ఎక్కువగా ఉండాలి. “తెలంగాణాలో ఈ తరహా వాతావరణం ఆసిఫాబాద్ చుట్టుపక్కల ప్రదేశాల్లో మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇది యాపిల్స్‌ను పండించటానికి అనువైన ప్రాంతంగా మేము భావించినట్లు సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ వీరభద్రరావు మన తెలంగాణకు తెలిపారు.

 

Apple Cultivation in Asifabad district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News