Tuesday, April 30, 2024

జలదిగ్బంధం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు

ఏడు జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరద తాకిడి

జలవలయంలో ఓరుగల్లు పట్టణం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు

సిద్ధిపేటలో వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి
కిన్నెరసాని జలశయానికి పోటెత్తిన వరద, భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం, మూడో
హెచ్చరిక జారీ చేసే అవకాశం
హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న వానలు, నిండుకుండలా హుస్సేన్‌సాగర్

 

Ponds filled with floods in Telangana due to Rain

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏడు జిల్లాల్లో జనజీవనం జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదనీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలు వరద తాకిడికి అతలాకుతలమయ్యాయి. వరద ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే 2500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మేడారాన్ని వరద ముంచెత్తింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలోని చెరువులో మత్తడి పడి జూపాక నుండి హుజరాబాద్ వైపు వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే గ్రామం నుండి బొతలపల్లి, అంకుషాపూర్, భీమ్, పెళ్లి కనుకులగిద్దేకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామం వద్ద చలివాగులో చిక్కుకున్న అదే గ్రామానికి చెందిన 12 మంది రైతులు సురక్షితంగా బయటకువచ్చారు. ఉదయం వ్యవసాయ మోటర్లు తెచ్చుకునేందుకు వెళ్లిన రైతులు వాగులో చిక్కుకోవడంతో తక్షణం స్పందించిన మంత్రి కెటిఆర్ రెండు హెలిక్యాప్టర్లు పంపించారు. వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువ చ్చారు. వారు క్షేమంగా రావడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు రైతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి చెందాడు. శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై రక్షణ గోడ కూలింది. కలిపాక-తిప్పాపురం మధ్య వాగులో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహెడ్ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన భాషంపల్లి అశోక్ తన రెండు ఎద్దులను శుక్రవారం పొలంలోనే కట్టివేసి మేత వేసి వచ్చాడు. తీరా శనివారం వచ్చి చూసే సరికి రెండు ఎద్దులు మృతి చెంది ఉన్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలం సమీపంలోని తుమ్మెద వాగుకు భారీ వరద వచ్చింది. దీంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ. లక్ష పైనే ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కలిపాక-తిప్పాపురం మధ్య వాగు ఉప్పొంగడంతో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. తిప్పాపురం గ్రామానికి చెందిన మీడెం చిన్న బతకయ్య(41) కలిపాక సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు్. వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో తాడు సాయంతో పలువురు దాటారు. అతడు కూడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్త్తు కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులు గాలింపు చేపట్టారు. నివారం ఉదయం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద గల్లంతైన లారీ డ్రైవర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొదట తాడుతో ప్రయత్నించగా.. నీటి ప్రవాహం ఎక్కువై డ్రైవర్ నీటిలో కొట్టుకుపోయారు. అనంతరం హెలికాప్టర్‌తో గాలించగా.. ప్రస్తుతం ప్రవాహం పెరగగా అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

పాలవాగు, పెద్దవాగు, గుండేటి వాగు, మద్దులమాడ వాగు, లోతు వాగులు అన్ని గరిష్ఠ నీటి మట్టంతో వరద నీరు ప్రవహిస్తుండడంతో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువకు 5,240 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. ఇదిలా ఉండగా మండలోని పలు చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు గ్రామాల్లో రోడ్లన్నీ చిత్తడిగా మరాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని చెరువులకు పూర్తి స్థాయిలో అలుగుపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. దీంతో గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు ఎడమ కాలువ ద్వారా రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం నాటికే పాలేరు రిజర్వాయర్ నిండుకుండను తలపించింది. శనివారం ఉదయం రిజర్వాయర్‌కు ఉన్న ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోవడంతో నీరు దిగువకు ఉరకలేస్తోంది. కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పోటెత్తింది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జలాశయంలో భారీగా వరద నీరు చేరింది. దీనితో అధికారులు 12 గేట్లను ఎత్తివేశారు. రెండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తడం వల్ల 12 గేట్లను ఎత్తివేశారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జలాశయంలో భారీగా వరద నీరు చేరింది.
నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్..
వారం రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్ల మేర కురుస్తున్న వర్షం అంతా కూడా సాగర్ లోకి వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.58 మీటర్లుగా ఉంది. దాంతో తూముని ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు జీహెచ్‌ఎంసీ లేక్స్ విభాగం అధికారులు. శుక్రవారం ఇన్ ఫ్లో ఔట్ ఫ్లోలో ఐదు వందల క్యూసెక్కులు ఉండగా.. శనివారం అది ఏడు వందల క్యూసెక్కులకు చేరింది. హైదరాబాద్ లో వర్షం సాధారణంగా కురుస్తుండడంతో పెద్దగా ఇబ్బందులు లేవంటున్నాయి బల్దియా వర్గాలు.
మేడారాన్ని ముంచెత్తిన వరదలు
శనివారం సాయంత్రం ములుగు జిల్లా మేడారం జాతర సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలను తాకుతూ జంపన్నవాగు బ్రిడ్జిపై నుంచి వరద ఉప్పోంగుతోంది. ఎటూ చూసినా కిలోమీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా సమ్మక్క కొలువైన చిలకల గట్టును తాకుతూ వాగులు ఉప్పొంగడం చరిత్రలో ఇదే మొదటిసారి.

Ponds filled with floods in Telangana due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News