Tuesday, May 7, 2024

ఉద్యమ ఉధృతి

- Advertisement -
- Advertisement -

Farmers protest against New Farm Bills

 

ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన పరిణామం కాదు. దేశ ప్రజల ఆకలి తీర్చడానికి అహరహం శ్రమిస్తున్న రైతులను తమ అధికార పీఠం పాదాల వద్ద పడిగాపులు కాయిస్తున్నారనే అప్రతిష్ఠ పాలకులకు మేలు చేయదు. ప్రజాస్వామ్యంలో పట్టువిడుపులుండాలి, అందులో ప్రభుత్వాధినేతలే ఎక్కువ బాధ్యతతో వ్యవహరించాలి. కాని ఇప్పుడలా జరగడం లేదు. ఇతర ఆందోళనల విషయంలో వ్యవహరించిన తీరులోనే రైతుల ఉద్యమానికి సంబంధించి కూడా ప్రధాని మోడీ ప్రభుత్వం పరిణత ప్రవర్తనను ఎంచుకోలేకపోయింది. నెలల తరబడిగా పంజాబ్‌లో ఆందోళన సాగించిన దశలోనే కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులలో గూడుకట్టుకున్న భయాలను అనుమానాలను తొలగించడానికి కేంద్రం ప్రయత్నించి ఉండవలసింది.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల రైతుల ఆందోళన రాజకీయ ప్రేరితమైనదనే నిర్ధారణకు మోడీ ప్రభుత్వం వచ్చి ఉంటే అది పొరపాటు. ఎందుకంటే అది తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రస్తుతమున్న రక్షణలన్నింటినీ తొలగించి వారిని కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నవే. అందుచేత ఈ చట్టాలు మూడింటిలోనూ రైతులకు మేలు చేసే అంశం ఇదీ అని ఇదమిత్థంగా వారికి చెప్పగలిగే స్థితిలో కేంద్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల అదుపాజ్ఞల్లో ఉండే వ్యవసాయ మార్కెట్లకు బయట తమ ఇష్టం వచ్చినట్లు తాము కోరుకున్న వారికి అమ్ముకునేందుకు రైతులకు కల్పించామన్న స్వేచ్ఛలో వారు దగాపడకుండా గట్టిగా వారి అండను నిలబడే అంశం ఒక్కటి కూడా లేకుండా ఆ చట్టాలు అవతరించాయి. కొత్త విద్యుత్ బిల్లులోనూ పేదలకు, రైతులకు లభిస్తున్న రాయితీలు, మినహాయింపులను మూలమట్టంగా హరించి వేసే ఏర్పాట్లను చేశారు. కేవలం పార్లమెంటులో గల ఎదురు లేని బలంతో హడావుడిగా తీసుకు వచ్చిన ఈ చట్టాలు రైతులను నిలువునా ముంచి కార్పొరేట్ శక్తులకు విశేష ప్రయోజనాలు కలిగించడానికి సంకల్పించినవేనని ఇంత గట్టిగా రుజువవుతున్నప్పుడు వారిని ఒప్పించి మెప్పించడానికి కేంద్రానికి సందెక్కడిది.

హర్యానాలో మాదిరిగా పంజాబ్‌లోనూ అకాలీ బిజెపి ప్రభుత్వం ఉండి ఉన్నా అక్కడి రైతులు ఈ చట్టాలను క్షమించే వారు కాదు. ఇది తెలిసే అకాలీదళ్ బిజెపితో తన చిరకాల మైత్రికి ఆదరాబాదరాగా సస్తి చెప్పి కేంద్రంలోని ఎన్‌డిఎ కూటమి నుంచి తప్పుకున్నది. బిజెపి కూటమి అధికారంలో ఉన్న హర్యానాలోని రైతులు కూడా తమ పంజాబ్ సోదరుల అడుగుల్లో అడుగేసి ఢిల్లీ ముట్టడిలో పాల్గొంటున్నారు. ఎన్ని ప్రతిపక్షాలు తమకు అండగా నిలిచినా తమది రాజకీయేతర పోరాటమని ఆందోళనలోని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. నెలల తరబడిగా ఉద్యమిస్తున్న రైతులు దండు కట్టి ఢిల్లీలో ప్రవేశించబోతే వారిపై లాఠీలు, పిచికారీలు ప్రయోగించడంలోనూ కేంద్ర ప్రభుత్వం తొందరపాటును ప్రదర్శించింది. చర్చలకు వారిని ఆహ్వానించిన తర్వాతనైనా నిజాయితీగా వ్యవహరించలేకపోతున్నది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఐదు విడతల చర్చలు విఫలమైన తర్వాత మంగళవారం నాడు హోం మంత్రి అమిత్ షాతో అప్పటికప్పుడు ఏర్పాటైన ఆరో విడత సంప్రదింపులు ఎన్నో ఆశలు కలిగించాయి.

అదే రోజున విజయవంతమైన భారత్ బంద్ సందేశాన్ని ప్రభుత్వం అర్థం చేసుకున్నదని రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తుందనే అభిప్రాయానికి తావిచ్చాయి. కాని అలా జరగలేదు. అమిత్ షా మాట మేరకు బుధవారం నాడు ప్రభుత్వం పంపించిన తాజా ప్రతిపాదనలు కూడా రైతులను సంతృప్తి పరచలేకపోయాయి. రైతులు చట్టాల రద్దునే కోరుతున్నారు. వాటిలో ఎన్ని సవరణలు చేసినా వాటి నిరంకుశ లక్షణం అంతం కాదని వారు భయపడుతున్నారు. వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతున్నది. దానికి రైతుల మేలు కంటె కార్పొరేట్ల లాభాలే ముఖ్యమని బోధపడుతున్నది. ఉద్యమం తదుపరి దశను అన్నదాతలు ప్రకటించారు. టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు, జైపూర్ ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధం వంటి కార్యక్రమాలను సంకల్పించారు.

ఉద్యమం తీవ్రతరమవుతున్న కొద్దీ ప్రభుత్వ బలగాలకు రైతులకు మధ్య అశాంతి చోటు చేసుకుంటే అది ఊహించని ఉపద్రవానికి తెర లేపుతుంది. వేల సంఖ్యలో ఒక చోట చేరిన రైతులు ప్రశాంతంగా ఆందోళనను నడపడం అత్యంత ప్రశంసనీయం. తదుపరి ఉద్యమ దశలో అంబానీల టెలికం సంస్థ జియో బహిష్కరణకు ఆందోళనకారులు పిలుపు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి రైతులు తరలి రావాలని ఆహ్వానం పలికారు. ఇవి ఉద్యమ తీవ్రతను సూచిస్తున్నాయి. కేంద్రం ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించి అన్నదాతల అసంతృప్తిని తొలగించగలదని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News