Wednesday, May 8, 2024

మహిళలకు 33 శాతం రిజర్వేషన్

- Advertisement -
- Advertisement -

హిళలకు 33 శాతం రిజర్వేషన్
కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, రైతుల ఖాతాల్లోకి రూ.18,000
మూడేళ్లుగా అవి రైతులకు అందకుండా మమత అడ్డుకున్నారని అమిత్‌షా ఆరోపణ
బెంగాల్‌లో బిజెపి మేనిఫెస్టో విడుదల

కోల్‌కతా: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా నినాదంతో సంకల్ప్ పాత్ర పేరుతో హోంమంత్రి అమిత్‌షా ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కెజి నుంచి పిజి వరకు మహిళలకు ఉచిత విద్య అందించనున్నట్టు తెలిపారు. గత మూడేళ్లుగా ఆ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్రం నుంచి పంపే డబ్బులు పడకుండా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అడ్డుకున్నారని అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టగానే రూ.18,000 చొప్పున 75 లక్షలమంది రైతుల ఖాతాల్లో ఆ డబ్బు జమ చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ఏటా రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6000కు రాష్ట్రం తరఫున మరో రూ.4000 కలిపి మొత్తం రూ.10,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. మత్సకారులకు కూడా ఏటా రూ.6000 చొప్పున వారి ఖాతాల్లో వేస్తామన్నారు.
రూ.11,000 కోట్లతో సోనార్ బంగ్లా నిధిని ఏర్పాటు చేసి కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.

అధికారం చేపట్టగానే బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను అమలులోకి తెస్తామన్నారు. తమ మేనిఫెస్టోలో మహిళల రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ఆరోగ్య సేవలు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అమిత్‌షా తెలిపారు. దేశంలో మహిళలకు రక్షణలేని రాష్ట్రాల్లో బెంగాల్ మొదటిస్థానంలో ఉన్నదని షా అన్నారు. మమత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి, రాజకీయ హింస పెరిగాయన్నారు. బెంగాల్‌లో జరిగిన రాజకీయ హత్యలపై సిట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బాధితులకు రూ.25 లక్షల వరకు పునరావాసం కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. బెంగాల్‌లోకి చొరబాట్లను అరికట్టేందుకు సరిహద్దులో ఫెన్సింగ్‌ను పటిష్టం చేయనున్నట్టు తెలిపారు.

BJP Manifesto announced in West Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News