Wednesday, May 8, 2024

ప్రీలాంచ్‌ల పేరుతో రియల్‌ ఎస్టేట్ మోసాలు

- Advertisement -
- Advertisement -

ప్రీలాంచ్‌ల పేరుతో రియల్‌సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయ్
వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అధికారులకు ఆదేశాలు జారీ
రెరాలో రిజిస్ట్రేషన్ కాని యూడిఎస్ భూములను కొనుగోళ్లు చేయవద్దు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్
‘మనతెలంగాణ’ కథనానికి స్పందన

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రీలాంచ్‌ల పేరిట కొన్ని రియల్‌ఎస్టేట్ సంస్థలు వినియోగదారులను మోసం చేస్తున్నాయని ఇలాంటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ‘మనతె లంగాణలో’ మార్చి 09వ తేదీన (ప్రీలాంచ్‌ల పేరిట మోసం) వచ్చిన కథనానికి సిఎస్ సోమేష్‌కుమార్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, టిఎస్ రెరా అధికారులతో సిఎస్ సోమేశ్‌కుమార్ గురువారం బిఆర్‌ఆర్‌కె భవన్‌లో సమావేశం నిర్వహించారు. ప్రజలు మోసం చేయకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు కొత్త వెంచర్ల గురించి ప్రజలకు అవసరమైన సూచనలతో పాటు పత్రికా ప్రకటనలను ఎప్పటికప్పుడు జారీ చేయాలని సిఎస్ వారికి సూచించారు. దీనికి సంబంధించి తగిన విధంగా చర్యలు చేపట్టాలని రెరా కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్లు కమిషనర్, ఐజిని, సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశించారు.

యూడిఎస్ భూములను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సిఎస్ సూచించారు. రాష్ట్రంలో రెరాలో రిజిస్ట్రేషన్ కానీ, సంస్థల యూడిఎస్ భూముల కొనుగోళ్లు చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సిఎస్ వారితో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి, మోసపూరిత అమ్మకాలు జరిగే చోట తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తాను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ కమిషనర్, ఐజి శేషాద్రి, డిటిసిపి, రెరా సెక్రటరీ విద్యాధర్, ఇతర అధికారులు, క్రెడాయ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సిఎస్‌తో సమావేశం అనంతరం దీనికి సంబంధించి ‘రెరా’ చైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘రెరా’ ప్రకటన ఇలా….
కొంత మంది రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, బిల్డర్లు, డెవలపర్లు తాము ప్రారంభించే, లేదా నిర్మించనున్న ప్రాజెక్టుల అన్ డివైడెడ్ షేర్ అఫ్ (UDS) లాండ్స్ ను తగ్గింపు ధరకు విక్రయిస్తామని పేర్కొంటూ ప్రకటనలు, మార్కెటింగ్, యూనిట్ల విక్రయాలు చేస్తున్నట్లు టిఎస్ రెరా దృష్టికి వచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ (రెగ్యులరైజేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్ – 2016 సెక్షన్ 3 (1) అండ్ 4(1) లకు, టిఎస్ రియల్ ఎస్టేట్ (రెగ్యులరైజేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్-2017 రూల్ 1(2) లకు విరుద్ధంగా ఉందని రెరా ఓ ప్రకటనలో పేర్కొంది.
రెరా యాక్ట్ – 2016 సెక్షన్ 59 ప్రకారం….
తెలంగాణ రియల్ ఎస్టేట్ (రెగ్యులరైజేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్ నిబంధనల ప్రకారం ముందస్తుగా రిజిస్ట్రేషన్లు జరగని ప్రాజెక్టుల్లోని UDS లాండ్స్ విక్రయాల రెరా యాక్ట్ – 2016 సెక్షన్ 59 ప్రకారం సదరు ప్రాజెక్టు మొత్తం విలువపై 10 శాతం వరకు పెనాల్టీ విధించడంతో పాటు సదరు రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, బిల్డర్లు, డెవలపర్లపై చర్య తీసుకుంటామన్నారు. రెరా యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగని ప్రాజెక్టుల్లోని UDS ప్లాట్లు, స్థలాలు, యూనిట్లు కొనుగోలు చేయరాదని ‘రెరా చైర్మన్’ ప్రజలను హెచ్చరించారు.

Somesh Kumar meeting with Real Estate Representatives

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News