Tuesday, April 30, 2024

వెండికొండ చానుకు అపూర్వ స్వాగతం

- Advertisement -
- Advertisement -

Mirabai Chanu returned to India

 

న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శనతో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజతం సాధించిన భారత ఆణిముత్యం, మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సోమవారం స్వదేశం చేరుకుంది. చానుకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అభిమానులు, అధికారులు మీరాబాయికి నీరాజనం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం వంటి నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులను కట్టడి చేయడం భద్రత సిబ్బందికి కష్టంగా మారింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో అభిమానులను చానుతో ఫొటోలను దిగేందుకు అనుమతి ఇవ్వలేదు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య చానును పోలీసులు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి తీసుకెళ్లారు.

టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న చానుకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం చాను కొద్ది సేపు మీడియాతో మాట్లాడింది. ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో రజతం సాధించడం గర్వంగా ఉందని పేర్కొంది. పతకం సాధించాలనే పట్టుదలతో చాలా ఏళ్లుగా తీవ్రంగా శ్రమించానని, తమ శ్రమ ఫలించడం ఆనందం కలిగించిందని తెలిపింది. ఎలాగైన పతకం సాధించాలనే పట్టుదలతో క్రీడలకు సిద్ధమయ్యాయని, అందులో సఫలం కావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయిందని తెలిపింది. ఇక తన విజయంలో కుటుంబ సభ్యులు, కోచ్‌లు, క్రీడా మంత్రిత్వ శాఖ సహకారం ఉందని వివరించింది. ఈ సందర్భంగా తన విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News