Tuesday, May 21, 2024

మహిళా ఎంపీలతో థరూర్ సెల్ఫీపై వివాదం

- Advertisement -
- Advertisement -

Controversy over Shashi Tharoor selfie with women MPs

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆరుగురు మహిళా ఎంపీలతో తీసుకున్న సెల్ఫీని సోమవారం ట్విటర్‌లో పోస్ట్ చేసిన థరూర్ పని చేసేందుకు లోక్‌సభ ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరంటారు అంటూ పెట్టిన కామెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. మహిళలను కించపరిచే విధంగా థరూర్ వ్యాఖ్య ఉందంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో కొందరు వ్యక్తులను నొప్పించినందుకు థరూర్ క్షమాపణలు చెప్పారు. మహిళా ఎంపీల ప్రోద్బలంతోనే తాను సెల్ఫీ తీసుకున్నానని, సునిశిత హాస్యంగా వ్యాఖ్య ఉండాలన్న కోరిక మేరకే తాను ఆ విధంగా వ్యాఖ్యానించానని ఆయన వివరణ ఇచ్చారు. మహిళా ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తహిళచి తంగపాండ్యన్, మిమి చక్రవర్తి, నస్రత్ జహా రూహి, జ్యోతిమణిలతో తీసుకున్న సెల్ఫీని థరూర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

కాగా..థరూర్ పోస్ట్ చేసిన వ్యాఖ్యపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ కూడా ఘాటుగా స్పందించారు. మహిళా ఎంపీలను ఒక ఆకర్షణీయమైన వస్తువుగా చూపుతూ వారు పార్లమెంట్‌లో, రాజకీయాలలో అందచేస్తున్న కృషిని కించపరుస్తున్నారని, పార్లమెంట్‌లో మహిళలను ఆకర్షణీయమైన వస్తువుగా చూపడాన్ని మానుకోవాలని థరూర్‌కు ఆమె హితవు చెప్పారు. కాగా..థరూర్ ట్వీట్‌కు అనుకూల స్పందన కూడా లభించడం విశేషం. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్వాలా గుత్తా ట్వీట్ చేస్తూ కొన్ని విషయాలను సీరియస్, భూతద్దంతో చూడవలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఒకే మూసలో ఉండే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు లభించిన ప్రశంసగా దీన్ని చూడాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News