హైదరాబాద్: మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. జూబ్లీహిల్స్ జె.ఆర్.సి. కన్వెన్షన్ లో వీహబ్ వుమెన్ యాక్సిల రేషన్ కార్యక్రమం నిర్వహించారు. వీహబ్ వువెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మహిళలే దేశానికి ఆదర్శం అని అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేది తమ లక్ష్యం అని చెప్పారు. రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే మహిళలు కోటీశ్వరులు కావాలని, మహిళలకు అండగా నిలబడతానని, ఆర్థికంగా ఎదగండని రేవంత్ రెడ్డి సూచించారు.
కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే, తీసుకొని దేశం విడిచి పారిపోతున్నారని, మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారని తెలియజేశారు. మహిళలు ఆర్థిక శిక్షణ పాటిస్తున్నారని, ఆడబిడ్డలను ప్రోత్సహించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కుకుంటే.. కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఒక యూనిక్ ఐడి కార్డు ఇస్తామని, మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వివరాలన్నీ తెలిపేలా యూనిక్ ఐడి కార్డు లభిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.